అసెంబ్లీ సాక్షిగా ఎండగడదాం.. సమావేశాలకు ఏర్పాటు చేయండి: కేసీఆర్‌

November 24, 2022


img

ఇటీవల తెలంగాణ మంత్రులు, ఎంపీలు వారి బంధుమిత్రులలపై ఈడీ, ఐ‌టి దాడులు పెరిగిపోతుండటంతో టిఆర్ఎస్‌ పార్టీలో తీవ్ర ఆందోళన నెలకొని ఉంది. అయితే తెలంగాణ ప్రభుత్వం కానీ సిఎం కేసీఆర్‌ గానీ వాటిని అడ్డుకోలేరు కనుక వాటిని ఎదుర్కొనేందుకు ఏదో ఓ గట్టి ప్రయత్నం చేయకతప్పని పరిస్థితి ఏర్పడింది. లేకుంటే తీవ్ర ఒత్తిడిలో ఉన్న టిఆర్ఎస్‌ నేతలు చేజారిపోయే ప్రమాదం ఉంటుంది. కనుక డిసెంబర్‌ నెలలో శాసనసభ సమావేశాలు నిర్వహించి శాసనసభ సాక్షిగా కేంద్ర ప్రభుత్వం తీరును ఎండగట్టాలని సిఎం కేసీఆర్‌ నిర్ణయించారు. డిసెంబర్‌లో వారం రోజుల పాటు శాసనసభ సమావేశాలు నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాల్సిందిగా ఈరోజు మంత్రులు హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డిలను ఆదేశించారు. 

ఈ సమావేశాలలో రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి, కేంద్ర ప్రభుత్వం ఆంక్షల కారణంగా రాష్ట్ర ఆదాయం సుమారు రూ.40,000 కోట్లు తగ్గడంపై చర్చించి ఈ అంశంపై కూడా కేంద్ర ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాలని సిఎం కేసీఆర్‌ భావిస్తున్నారు. శాసనసభ వేదికగా రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి గురించి, అలాగే కేంద్రం వేదింపుల గురించి ప్రజలకు తెలియజేయడం మంచిదని కేసీఆర్‌ నిర్ణయించారు. 


Related Post