విచారణకు రారా... ఎంతకాలం?ఈమెయిల్ ద్వారా నోటీస్ పంపండి

November 23, 2022


img

టిఆర్ఎస్‌ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో విచారణ కోసం బిజెపి అగ్రనేత బిఎల్ సంతోష్కి సిట్ బృందం నోటీసు పంపినా రాకపోవడంతో హైకోర్టులో పిటిషన్‌ వేశారు. ఈరోజు మధ్యాహ్నం భోజన విరామం తర్వాత మరోమారు విచారణ చేపట్టిన హైకోర్టుకి బిఎల్ సంతోష్ రాలేదని ప్రభుత్వం తరపున వాదించిన అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ కోర్టుకి తెలియజేశారు. ఈ కేసుపై సుప్రీంకోర్టు ఉత్తర్వులు కూడా హైకోర్టుకి అందాయి. ఈ కేసుతో సంబందం ఉందనుకొన్నవారిని సిట్ విచారించవచ్చు కానీ ఎవరినీ అరెస్ట్ చేయడానికి వీల్లేదని దానిలో స్పష్టంగా పేర్కొంది. 

బిజెపి తరపున ఈ కేసు వాదించడానికి వచ్చిన ప్రముఖ న్యాయవాది మహేష్ జట్మలానీ ప్రస్తుతం బిఎల్ సంతోష్ గుజరాత్‌ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారని అందుకే సిట్ విచారణకు హాజరుకాలేకపోయారని తెలిపారు. ఇరు పక్షాల వాదనలు విన్న తర్వాత ఆయనకి ఈమెయిల్, వాట్స్ అప్‌ద్వారా మరోసారి నోటీస్ పంపించాలని ఆదేశిస్తూ ఈ కేసు తదుపరి విచారణను ఈ నెల 30కి వాయిదా వేసింది. 

కనుక సిట్ బృందం తక్షణమే బిఎల్ సంతోష్‌కి ఈమెయిల్, వాట్స్ అప్‌ద్వారా మరోసారి నోటీస్ పంపించడం ఖాయం. కానీ ఆయన ఏదో వంకతో రాకుండా తప్పించుకొనేందుకు ప్రయత్నించడం కూడా ఖాయం. బహుశః సుప్రీంకోర్టుని ఆశ్రయించి ఢిల్లీలోనే విచారణ జరపాలని కోరినా కోరవచ్చు. ఈ నెల 30వ తేదీలోగా ఆయన వస్తారా లేదో తేలిపోతుంది. ఒకవేళ రాకపోతే అప్పుడు హైకోర్టు ఏం నిర్ణయం తీసుకొంటుందో చూడాలి.


Related Post