రూ.100 కోట్లతో విమానం కొనబోతున్న సిఎం కేసీఆర్‌!

September 30, 2022


img

తెలంగాణ సిఎం కేసీఆర్‌ సుమారు రూ.100 కోట్లతో విమానం కొనుగోలు చేయబోతున్నారు. త్వరలో జాతీయ రాజకీయాలలో ప్రవేశించి వివిద రాష్ట్రాలు పర్యటించబోతున్నందున, టిఆర్ఎస్‌కు చెందిన కొందరు నేతలు ఇచ్చిన విరాళాలతో సొంత విమానం కొనబోతున్నారు.

సిఎం కేసీఆర్‌ ఈరోజు తన సతీమణితో కలిసి యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారిని దర్శించుకోనున్నారు. ఆలయ గోపురం బంగారు తాపటానికి తన కుటుంబం తరపున ఒక కేజీ, 16 తులాలు బంగారం ఇస్తానని సిఎం కేసీఆర్‌ ఇదివరకు హామీ ఇచ్చారు. నేడు ఆ బంగారాన్ని ఆలయ అధికారులకు సిఎం కేసీఆర్‌ దంపతులు అందజేయనున్నారు. 

సిఎం కేసీఆర్‌ జాతీయ పార్టీ రిజిస్ట్రేషన్ కోసం కేంద్ర ఎన్నికల కమీషన్‌కు సమర్పించేందుకు సిద్దం చేసుకొన్న పత్రాలను స్వామివారి పాదాల వద్ద ఉంచి పూజలు చేయించి, ఆశీర్వాదం తీసుకొంటారు. అక్టోబర్‌ 5వ తేదీన దసరా పండుగనాడు ఆ పత్రాలపై సంతకాలు చేసిన తర్వాత జాతీయ పార్టీ ఏర్పాటు గురించి అధికారికంగా ప్రకటిస్తారు. ఆ తర్వాత కేంద్ర ఎన్నికల కమీషన్‌ వద్ద ఆ పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత కరీంనగర్‌లో భారీ బహిరంగసభ నిర్వహించి జాతీయ పార్టీ ఎందుకు ఏర్పాటు చేయవలసి వచ్చిందో, దాంతో తాను ఏవిదంగా ముందుకు సాగబోతున్నానో సిఎం కేసీఆర్‌ వివరిస్తారు. వివిద రాష్ట్రాలలోని తనతో కలిసివచ్చే నాయకులను ఆ సభకు ఆహ్వానిస్తారు. ఈరోజు యాదాద్రిలో ప్రత్యేక పూజలు చేసి తిరిగి వచ్చిన తర్వాత రేపు (శనివారం) సిఎం కేసీఆర్‌ దంపతులు వరంగల్‌ భద్రకాళి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేస్తారు. 


Related Post