మిషన్ భగీరధకు కేంద్రం అవార్డ్… బిజెపి నేతలు ఏమంటారు?

September 29, 2022


img

తెలంగాణ బిజెపి నేతలు మిషన్ భగీరధని కమీషన్‌ భగీరధ అని అవహేళన చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం అదే పధకానికి ఈరోజు అత్యుత్తమ పధకంగా అవార్డు ప్రకటించింది. దేశంలో అత్యధిక గ్రామీణ ప్రాంతాల ప్రజలకు 100 శాతం శుద్ధమైన మంచినీటిని అందిస్తున్న గొప్ప పధకంగా కేంద్ర ప్రభుత్వం మిషన్ భగీరధను గుర్తించి అవార్డు ప్రకటించింది. వచ్చే నెల 2వ తేదీన ఢిల్లీలో రాష్ట్రపతి భవన్‌లో జరిగే కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్‌ రాష్ట్రపతి  ద్రౌపదీ ముర్ము చేతుల మీధుగా ఈ అవార్డును అందుకోబోతున్నారు. 

ఈ అవార్డులపై మంత్రి హరీష్‌ రావు హైదరాబాద్‌లో స్పందిస్తూ, “ఈ అవార్డులు మా ప్రభుత్వ చిత్తశుద్ది, సమర్ధతకి నిదర్శనంగా నిలుస్తాయి. మా ప్రభుత్వం మిషన్ భగీరధ ద్వారా రాష్ట్రంలో గ్రామాలకు శుద్ధమైన మంచినీటిని సరఫరా చేస్తున్నామని కేంద్ర ప్రభుత్వం గుర్తించింది కానీ రాష్ట్రంలో బిజెపి నేతలు గుర్తించలేకపోయారు. రాష్ట్రంలో పాదయాత్రలు, ర్యాలీలు చేస్తున్న బిజెపి నేతలు ఎప్పుడైనా నీళ్ళు, విద్యుత్‌ వంటి అంశాల గురించి ఎప్పుడూ మాట్లాడరు. మా ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తూ బురద జల్లడమే తప్ప వారి వలన రాష్ట్రానికి ఏ ఉపయోగమూ లేదు. 

కేంద్ర మంత్రులు కూడా ఢిల్లీలో మా ప్రభుత్వాన్ని ప్రశంశిస్తూ, తెలంగాణకు వచ్చి విమర్శిస్తూ ద్వందవైఖరి ప్రదర్శిస్తుంటారు. వారికి దమ్ముంటే రాష్ట్రానికి నిధులు ఇచ్చి మాట్లాడాలి. ఈ పధకానికి నీతి ఆయోగ్ రూ.19 వేల కోట్లు ఇవ్వాలని సిఫార్సు చేసిన కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. వివిద పధకాలకు మరో రూ.5,300 కోట్లు ఇవ్వాలని నీతి ఆయోగ్ సూచించిన కేంద్రం పట్టించుకోలేదు. కానీ సిఎం కేసీఆర్‌ మానసపుత్రిక అయిన ఈ మిషన్ భగీరధ వంటి పధకాలను కేంద్ర ప్రభుత్వం కాపీ కొట్టి జల్ జీవన్ మిషన్ అంటూ సొంతపేర్లు పెట్టుకొని అమలుచేస్తోంది. కావాలంటే మా రైతుబంధు, వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ వంటి పధకాలు కూడా కాపీ కొట్టి దేశమంతటా అమలుచేయాలి. ఈ అవార్డులతో మా ప్రభుత్వం చేస్తున్న పనులకు మంచి గుర్తింపు లభించింది. కానీ అవార్డులతోనే ఇటువంటి పధకాలు, అభివృద్ధి పనులు జరిగిపోవు. కనుక నిధులు కూడా మంజూరు చేయాలి,” అని అన్నారు.


Related Post