ఢిల్లీ నుంచి గల్లీ దాకా కాంగ్రెస్‌ తీరు ఇంతే!

September 22, 2022


img

కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందా లేదా అనేదాంతో సంబందం లేకుండా ఆ పార్టీలో నేతలందరూ ఎప్పుడూ పదవుల కోసం కుమ్ములాడుకొంటూనే ఉండటమే ఆ పార్టీ ప్రత్యేకత. ఉత్తమ్ కుమార్‌ రెడ్డి పదవీకాలం ముగిసిన తర్వాత తెలంగాణ కాంగ్రెస్‌ అధ్యక్ష పదవికి ఎవరిని ఎంపిక చేయాలని కాంగ్రెస్‌ అధిష్టానం ఆలోచిస్తున్నప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్‌ నేతలు ఎలా కుమ్ములాడుకొన్నారో అందరూ చూశారు. నేటికీ అవి కొనసాగుతూనే ఉన్నాయి. 

ఈ విషయంలో ఢిల్లీ నుంచి గల్లీ వరకు అందరి తీరు ఒకేలా ఉంటుందని నిరూపిస్తూ కాంగ్రెస్‌ జాతీయ నాయకులు కూడా నిరూపిస్తున్నారు. ఆరోగ్య కారణాల చేత సోనియా గాంధీ పార్టీని నడిపించలేకపోతున్నారు. రాహుల్ గాంధీ, ప్రియాంకా వాద్రాలు అధ్యక్ష పదవి చేపట్టదలచుకోలేదని చెపుతున్నారు. కనుక మళ్ళీ చాలా ఏళ్ళ తర్వాత నెహ్రూ కుటుంబానికి చెందని నేతలు ఈ పదవి చేపట్టేందుకు అవకాశం ఏర్పడింది. 

ఇంతవరకు సోనియా, రాహుల్, ప్రియాంకాలను చూసి చాలా మంది వెనక్కు తగ్గారు కానీ ఇప్పుడు వారు బరిలో నుంచి తప్పుకోవడంతో, పార్టీలో చాలా మంది అధ్యక్ష పదవికి పోటీ పడుతున్నారు. సీనియర్ నేతలు అశోక్ గెహ్లాట్, శశిధరూర్ ఇద్దరూ వేర్వేరుగా సోనియా గాంధీని కలిసి తాము అధ్యక్ష పదవికి పోటీ చేయాలనుకొంటున్నాట్లు చెప్పారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కురువృద్ధుడు దిగ్విజయ్ సింగ్ కూడా బరిలో దిగారు. తాను కూడా ఈ రేసులో ఉన్నానని చెప్పేందుకు ఇవాళ్ళ ఆయన సోనియా గాంధీతో భేటీ  అవుతున్నారు. 

కాంగ్రెస్‌ అధ్యక్ష పదవికి ఎన్నికల నోటిఫికేషన్‌ గురువారం విడుదలైంది. దాని ప్రకారం... ఈనెల 24 నుంచి నెలాఖరు వరకు నామినేషన్స్, అక్టోబర్‌ 1వ తేదీన వాటి పరిశీలన, అక్టోబర్‌ 8వరకు వాటి ఉపసంహరణ గడువు, ఒకవేళ పోటీలో ఒకరి కంటే ఎక్కువమంది అభ్యర్ధులున్నట్లయితే అక్టోబర్‌ 17వ తేదీన పోలింగ్ నిర్వహించనున్నారు. అక్టోబర్‌ 19వ తేదీన ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటించనున్నారు.    Related Post