మంత్రి సత్యవతి రాథోడ్‌కు ములుగులో చేదు అనుభవం

September 21, 2022


img

తెలంగాణ రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ మంగళవారం ములుగు జిల్లా పర్యటనకు వెళ్ళినప్పుడు చేదు అనుభవం ఎదురైంది. సొంత పార్టీ నేతలే ఆమె కారుకి అడ్డంగా రోడ్డుపై బైటాయించి నిరసనలు తెలిపారు. ‘మంత్రి సత్యవతి గో బ్యాక్’ అంటూ నినాదాలు చేశారు. దళిత బంధు లబ్దిదారుల ఎంపికలో తమకు అన్యాయం జరిగిందని వారు నిరసనలు తెలియజేశారు. వారిలో కొంతమంది టిఆర్ఎస్‌ కార్యకర్తలు ఆమె కాళ్ళు పట్టుకొని తమకు దళిత బంధు పధకం ఇప్పించాలని ప్రార్ధించగా, మరికొందరు తమకు ఆ పధకం ఇప్పించే వరకు మంత్రి సత్యవతి రాధోడ్ ములుగు జిల్లాలో అడుగుపెట్టవద్దంటూ ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 

జడ్పీ ఛైర్మన్ కుసుమ కూడా వారితో కలిసి నిరసన తెలిపారు. సుమారు 30 నిమిషాలు మంత్రి కారుని కదలనీయకుండా వారు అడ్డుకొన్నారు. చివరికి జడ్పీ ఛైర్మన్ కుసుమ ఆమె వద్దకు వచ్చి పార్టీలో దళితులకు అన్యాయం చేయవద్దని, అర్హులైన వారందరికీ దళిత బంధు పధకం ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు. జిల్లాకు చెందిన పార్టీ ఎంపీ కవిత ఏనాడూ పార్టీ కార్యకర్తలను పట్టించుకోలేదని వారు ఆరోపించారు. ములుగు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే సీతక్కతో టిఆర్ఎస్‌ మంత్రులు రాసుకుపూసుకు తిరుగుతూ ఆమెకు ఎందుకు వంత పాడుతున్నారని టిఆర్ఎస్‌ కార్యకర్తలు మంత్రి సత్యవతి రాధోడ్‌ని నిలదీశారు. ఇకనైన ఆమె వెంట తిరగడం మానుకొని సొంత పార్టీ కార్యకర్తలను పట్టించుకోవాలని వారు కోరారు. ఊహించని ఈ నిరసనలతో మంత్రి సత్యవతి రాధోడ్‌ షాక్ అయ్యారు. కానీ తేరుకొని అర్హులందరికీ తప్పకుండా దళిత బంధు పధకం ఇప్పిస్తానని హామీ ఇచ్చి అక్కడి నుంచి కదిలారు. 


Related Post