అమెరికా వెళ్ళాలనుకొంటున్నారా అయితే కేఏ పాల్‌ను కలవండి

September 20, 2022


img

ఎల్లప్పుడూ ఉద్రిక్తంగా సాగుతుండే రాజకీయాలలో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ కామెడీ పండిస్తూ అందరికీ కాస్త రిలీఫ్ ఇస్తుంటారు. మునుగోడు ఉపఎన్నికలను మూడు ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఎన్నికల గంట మ్రోగకమునుపే అక్కడ ఎంత ఉద్రిక్త వాతావరణం నెలకొందో అందరికీ తెలుసు. సరిగ్గా ఇటువంటి సమయంలో కేఏ పాల్ మళ్ళీ ఎంట్రీ ఇచ్చారు. 

ఆయన ఈరోజు మీడియాకు ఓ వీడియో సందేశం పంపించారు. దానిలో ఆయన ఎమన్నారంటే, “మునుగోడులో ఉన్న 50,000 మంది నిరుద్యోగులు మీ బయోడేటాలు తీసుకొని ఈ నెల 25వ తేదీ (ఆదివారం) మధ్యాహ్నం 3 నుంచి 5 గంటల లోపు శ్రీవారు హోమ్స్ లోని మైదానంవద్దకు రండి. మీ వెంట మీ కుటుంబ సభ్యులు అందరినీ తీసుకురండి. ఆ రోజు నా 59వ పుట్టినరోజు సందర్భంగా మీ అందరి దరఖాస్తులను లాటరీ వేసి మీలో 59 మందికి నేనే నా సొంత ఖర్చులతో పాస్ పోర్ట్, అమెరికాలో ఉద్యోగ వీసాలకు స్పాన్సర్ షిప్ చేయించి ఇస్తాను. ఒకవేళ 175 గ్రామాల నుంచి నిరుద్యోగులు వస్తే ఒక్కో గ్రామానికి ఒకటి చొప్పున 175 మందికి పాస్ పోర్ట్, అమెరికాలో ఉద్యోగ వీసాలు చేయించి ఇస్తాను. 

బీసీగా పుట్టి దళిత యువతిని వివాహం చేసుకొన్న నాకు నిరుద్యోగుల కష్టాలు ఏమిటో బాగా తెలుసు. తెలంగాణ సిఎం కేసీఆర్‌ కానీ, మన ప్రధాని నరేంద్రమోడీగానీ మీ కష్టాలు అర్దం చేసుకోలేదు. ఇంటికో ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చిన కేసీఆర్‌, ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న ప్రధాని నరేంద్రమోడీ ఇద్దరూ మిమ్మల్ని మోసం చేశారు. కనుక మునుగోడులో నిరుద్యోగులకు అమెరికాలో ఉద్యోగాలు చేసుకొని బాగుపడేందుకు నావంతు సహాయం నేను చేయాలని నిర్ణయించుకొన్నాను. అందరికీ ఉద్యోగాలు వస్తే మన జిల్లా, మన రాష్ట్రం కూడా అభివృద్ధి చెందుతుందనే ఉద్దేశ్యంతోనే నేను మీ అందరికీ ఈ ఆఫర్ ఇస్తున్నాను. ఈ సదవకాశాన్ని అందరూ వినియోగించుకొని వృద్ధిలోకి రావాలని కోరుకొంటున్నాను,” అని అన్నారు. 

కనుక అమెరికా వెళ్లాలనుకొనేవారందరూ అమెరికన్ కార్యాలయం చుట్టూ తిరిగి సమయం, డబ్బు వృధా చేసుకోవధ్ధు. నేరుగా కేఏ పాల్ వద్దకు వెళితే ఆయన పాస్ పోర్ట్, వీసా రెండూ ఏర్పాటు చేస్తారు. మరింకెందుకు ఆలస్యం?

(వీడియో ఈనాడు సౌజన్యంతో)


Related Post