వీఆర్వోల సర్దుబాటుపై హైకోర్టు స్టే

August 09, 2022


img

తెలంగాణ ప్రభుత్వం గ్రామ రెవెన్యూ అధికారులు (వీఆర్వో) వ్యవస్థను రద్దు చేసి వారిని ఇతర శాఖలలో సర్దుబాటు చేస్తున్న సంగతి తెలిసిందే. దీని కోసం రాష్ట్ర ప్రభుత్వం గత నెల జీవో 121 జారీ చేసింది. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ తెలంగాణ వీఆర్వోల సంఘం హైకోర్టులో ఓ పిటిషన్‌ వేసింది.

తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్, జస్టిస్‌ సీవీ భాస్కర్‌రెడ్డి ధర్మాసనం దీనిపై సోమవారం విచారణ చేపట్టింది.

వీఆర్వో వ్యవస్థను రద్దు చేసినప్పటికీ వారికి నష్టం కలగకూడదనే ఆలోచనతోనే రాష్ట్ర ప్రభుత్వం వీఆర్వోలను వివిద శాఖలలో సర్దుబాటు చేస్తోందని ప్రభుత్వం తరపున వాదించిన అడ్వొకేట్‌ జనరల్‌ బీఎస్‌ ప్రసాద్‌ తెలిపారు. మొత్తం 5,000 మంది వీఆర్వోలలో 56 మంది తప్ప మిగిలినవారందరూ ఇప్పటికే వివిద శాఖలలో చేరి విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు.

పిటిషనర్‌ తరఫున వాదించిన సీనియర్ అడ్వొకేట్‌ పీవీ కృష్ణయ్య ప్రభుత్వం వీఆర్వో వ్యవస్థను రద్దు చేయాలనుకొన్నప్పుడు ముందుగా చట్టం తీసుకురావాలి. దానిలో అందుకు అవసరమైన నియమనిబందలను, మార్గదర్శకాలను రూపోదించాలి. కానీ ఇవేమీ చేయకుండా ఓ జీవో ద్వారా వీఆర్వో వ్యవస్థను రద్దు చేయడం, బదిలీలతో సంబందం లేకుండా వీఆర్వోలను ఇతర శాఖలలోకి సర్దుబాటు చేయడం చట్ట విరుద్దమని వాదించారు.

ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్‌ 121పై తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు స్టే విధిస్తున్నట్లు ప్రకటిచింది. ఇతర శాఖల విధులలో చేరనివారిని, ఇంకా రెవెన్యూ శాఖలోనే కొనసాగుతున్న వీఆర్వోలను ఇతర శాఖలలో సర్దుబాటు చేయరాదని, తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు అందరినీ రెవెన్యూ శాఖలో కొనసాగించాలని హైకోర్టు ధర్మాసనం తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం కౌంటరు దాఖలు చేయాలని ఆదేశిస్తూ ఈ కేసు తదుపరి విచారణను ఆగస్ట్ 29కి వాయిదా వేసింది.


Related Post