మోడీ నాకు మంచి మిత్రుడు కానీ పోరాడక తప్పడం లేదు: కేసీఆర్‌

August 06, 2022


img

తెలంగాణ సిఎం కేసీఆర్‌ శనివారం సాయంత్రం ప్రగతి భవన్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మళ్ళీ ప్రధాని నరేంద్రమోడీ వైఖరి, కేంద్ర ప్రభుత్వం పనితీరును ఎండగడుతూ తీవ్ర విమర్శలు గుప్పించారు. 

కేంద్ర ప్రభుత్వం వైఖరికి నిరసనగా రేపు ప్రధాని నరేంద్రమోడీ అధ్యక్షతన ఢిల్లీలో జరుగబోయే నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నాను. ఇదే విషయం లేఖ ద్వారా కూడా ప్రధాని నరేంద్రమోడీకి తెలియజేశాను.  ప్రధాని నరేంద్రమోడీ నాకు మంచి మిత్రుడు కానీ దేశం కోసం ప్రజల తరపున నిలబడి ఆయనతో పోరాడక తప్పడం లేదు. 

ఒకప్పుడు ఎందరో మహానుభావులు, మేధావులు కలిసి ప్రణాళికా సంఘాన్ని స్థాపించి దేశం అభివృద్ధిపదంలో నడిపించారు. ప్రధాని నరేంద్రమోడీ అధికారంలోకి వచ్చాక దానిని రద్దు చేసి నీతి ఆయోగ్ అనే భజన సంఘాన్ని ఏర్పాటు చేసుకొన్నారు. దానికి ఎటువంటి అధికారాలు లేవు. దాని మాట చెల్లదు. గత నీతి ఆయోగ్ సమావేశాలలో నేను దేశాభివృద్ధికి అనేక సూచనలు చేశాను. వాటిని అందరూ మెచ్చుకొన్నారు కూడా కానీ కేంద్ర ప్రభుత్వం వాటిని పక్కన పడేసింది. నీతి ఆయోగ్‌కు చెప్పుకొన్నా గోడకు చెప్పుకొన్నా ఒకటే కనుక అటువంటి సమావేశానికి వెళ్ళడం డబ్బులు దండగ కూడా. 

మొదట్లో నేను కూడా ప్రధాని నరేంద్రమోడీ దేశాన్ని అభివృద్ధి చేస్తారని ఆశపడేవాడిని కానీ ఆయన నియంతృత్వ పోకడలు పోతూ దేశాన్ని సర్వ నాశనం చేస్తున్నారు. రాష్ట్రాల హక్కులు హరించి వేస్తూ, దేశంలో బిజెపి తప్ప మరో పార్టీ ఉండకూడని అంటున్నారు. ఇదేనా  మీ ఫెడరల్ స్పూర్తి?” అంటూ సిఎం కేసీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.  

పంద్రాగస్ట్ సందర్భంగా సిఎం కేసీఆర్‌ వాళ్ళ రాష్ట్ర ప్రజలకు కానుక ప్రకటించారు. రాష్ట్రంలో కొత్తగా మరో 10 లక్షల మందికి ఆసరా పింఛన్లు మంజూరు చేసినట్లు చెప్పారు. 57 ఏళ్ళు పైబడిన వారందరికీ పింఛన్లు ఇస్తామని, ఆగస్ట్ 15వ తేదీ నుంచి పంపిణీ కార్యక్రమం మొదలుపెడతామని చెప్పారు. డయాలసిస్ (రక్తశుద్ధి) చేయించుకొంటున్న కిడ్నీ రోగులకు కూడా ఇక నుంచి పింఛన్లు ఇవ్వాలని నిర్ణయించినట్లు సిఎం కేసీఆర్‌ ప్రకటించారు.


Related Post