తెలంగాణ కాంగ్రెస్‌కు మరో పెద్ద షాక్... దాసోజు రాజీనామా

August 05, 2022


img

మునుగోడు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇచ్చిన షాక్ నుంచి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇంకా తేరుకోకమునుపే ఈరోజు మరో షాక్ తగిలింది. సీనియర్ నేత, పార్టీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ కుమార్‌ ఈరోజు పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. 

గత ఎన్నికలలో ఆయన ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. కనుక వచ్చే ఎన్నికలలో కూడా మళ్ళీ అక్కడి నుంచే పోటీ చేయాలని భావిస్తుంటే పిసిసి అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి దివంగత కాంగ్రెస్‌ నాయకుడు పి.జనార్ధన్ రెడ్డి కుమార్తె, టిఆర్ఎస్‌ కార్పొరేటర్‌ విజయ రెడ్డిని పార్టీలో చేర్చుకొన్నారు. వచ్చే ఎన్నికలలో ఆమెకు ఖైరతాబాద్ నుంచి పోటీ చేసేందుకు టికెట్ ఇస్తాననే హామీతో పార్టీలోకి రప్పించినట్లు తెలుస్తోంది. అదీగాక దాసోజు శ్రవణ్ కుమార్‌ కూడా రేవంత్‌ రెడ్డి నాయకత్వం, తీరు పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. కనుక తనకు మాత్రా మాత్రంగానైనా చెప్పకుండా విజయ రెడ్డిని పార్టీలో చేర్చుకొని ఆమెకు ఖైరతాబాద్ టికెట్ ఇస్తానని హామీ ఇవ్వడంపై దాసోజు శ్రవణ్ కుమార్‌ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. అందుకే ఆయన రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. 

తోటి సీనియర్ నేతలు ఆయనను బుజ్జగించి రాజీనామా ఆలోచన విరమింపజెసేందుకు ప్రయత్నిస్తున్నారు. వారి బుజ్జగింపులు ఫలించి ఆయన పార్టీలోనే ఉంటారా లేక రాజీనామాకు కె మొగ్గుచూపుతారా అనేది నేడో రేపో తేలిపోతుంది. ఇతర పార్టీల నేతలను పార్టీలోకి ఆకర్షిస్తే పార్టీ బలపడుతుందని రాజకీయ పార్టీలు భావిస్తుంటాయి. అయితే ఒకరు బయట నుంచి వస్తే మరొకరు లోపల నుంచి బయటకు వెళ్ళిపోయే ప్రమాదం కూడా ఉందని గ్రహించకపోవడమే ఆశ్చర్యం కలిగిస్తుంది.


Related Post