అగ్నిపథ్‌ను వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టు పిటిషన్‌

June 21, 2022


img

త్రివిద దళాలలో సైనికుల నియామకానికి కేంద్రప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన అగ్నిపథ్‌ పధకాన్ని వ్యతిరేకిస్తూ హైదరాబాద్‌కు చెందిన న్యాయవాది ఎంఎల్ శర్మ సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేశారు. దేశ రక్షణ వ్యవస్థను తీవ్రంగా ప్రభావితం చేసే ఈ అగ్నిపథ్‌ వలన భవిష్యత్‌లో అనేక కొత్త సమస్యలు ఉద్భవిస్తాయని పిటిషనర్‌ పేర్కొన్నారు. దీనిపై దేశవ్యాప్తంగా నిరుద్యోగ యువత పెద్ద ఎత్తున నిరసనలు, ఆందోళనలు చేస్తున్నారని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. రాజ్యాంగ విరుద్దంగా ఉన్న ఈ అగ్నిపథ్‌కు పార్లమెంట్ ఆమోదం కూడా లేదని, కనుక అగ్నిపథ్‌ను రద్దు చేయాలని, ఈ విధానంలో త్రివిద దళాలు నియామకాలు చేపట్టకుండా అడ్డుకోవాలని అభ్యర్ధించారు. 

అయితే ఇటువంటి ప్రభుత్వ విధానాలు, నిర్ణయాలలో సాదారణంగా న్యాయస్థానాలు కూడా జోక్యం చేసుకొనేందుకు ఇష్టపడవు. కనుక సుప్రీంకోర్టు కూడా అదే చెప్పవచ్చు. దేశంలో నిరసనలు వెల్లువెత్తుతున్నప్పటికీ కేంద్రప్రభుత్వం మాత్రం అగ్నిపథ్‌ విధానంలో సైనికులను రిక్రూట్మెంట్‌ కొరకు అప్పుడే నోటిఫికేషన్‌ తేదీలను ప్రకటించేసింది. 

ఇండియన్ ఆర్మీలో అగ్నివీర్ ఉద్యోగాలకు జూన్20, నేవీలో ఉద్యోగాలకు జూన్‌ 21, ఎయిర్ ఫోర్సులో ఉద్యోగాలకు జూన్‌ 24న నోటిఫికేషన్‌ వెలువడతాయని ప్రకటించింది. 

అగ్నిపథ్‌ను వ్యతిరేకిస్తూ నిన్న నిర్వహించిన భారత్‌ బంద్‌కు పెద్దగా స్పందన రాలేదు. మళ్ళీ ఈ నెల 24వ తేదీన సంయుక్త కిసాన్ మోర్చా అధ్వర్యంలో దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టబోతోందని రైతు సంఘాల నాయకుడు రాకేష్ తికాయత్ తెలిపారు. 


Related Post