రాష్ట్రానికి ప్రధాని మోడీ రాక..సిఎం కేసీఆర్‌కు ఇబ్బంది

May 19, 2022


img

ప్రధాని నరేంద్రమోడీ ఈనెల 26న తెలంగాణ పర్యటనకు రానున్నారు. ఆ రోజున గచ్చిబౌలిలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వార్షికోత్సవంలో పాల్గొనేందుకు వస్తున్నారు. ఆదే రోజున రామగుండంలో ఎరువుల ఫ్యాక్టరీ పునః ప్రారంభానికి, జీనోమ్ వ్యాలీలో కొత్తగా నిర్మించిన జాతీయ జంతు సౌకర్య, జీవ వైద్య పరిశోధనా సంస్థ ప్రారంభానికి  ప్రధాని నరేంద్రమోడీ సమయం కేటాయించవలసిందిగా కోరుతూ ప్రధాని కార్యాలయానికి అభ్యర్ధనలు వచ్చాయి. వాటిపై ఇంకా నిర్ణయం తీసుకోవలసి ఉంది. 

ఇటీవల తుక్కుగూడలో జరిగిన బిజెపి సభకు కేంద్రహోంమంత్రి అమిత్ షా హాజరవడంతో మంచి ఉత్సాహంతో ఉన్న రాష్ట్ర బిజెపి నేతలు, ఇప్పుడు ప్రధాని నరేంద్రమోడీ హైదరాబాద్‌ పర్యటనకు వస్తుండటంతో మరింత ఉత్సాహంగా ఉన్నారు. అయితే ఈసారి ప్రధాని నరేంద్రమోడీ 26న వచ్చి అదే రోజున చెన్నై వెళతారు. కనుక బేగంపేట విమానాశ్రయంలో తమతో కొంతసేపు సమావేశం అయ్యేందుకు ప్రధాని సమయం కేటాయించాలని రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌ ప్రధాని కార్యాలయాన్ని అభ్యర్ధించారు. 

హుజూరాబాద్‌ ఉపఎన్నికలలో బిజెపి చేతిలో టిఆర్ఎస్‌ ఓడిపోయినప్పటి నుంచి కేంద్రంపై సిఎం కేసీఆర్‌ యుద్ధం ప్రకటించినందున, ప్రధాని నరేంద్రమోడీ హైదరాబాద్‌ రాక చాలా ఇబ్బందికరంగానే మారిందని చెప్పవచ్చు. ఇదివరకు ముచ్చింతల్‌లో రామానుజుల వారి విగ్రహావిష్కరణకు ప్రధాని నరేంద్రమోడీ వచ్చినప్పుడు, ప్రోటోకాల్ ప్రకారం సిఎం కేసీఆర్‌ ఆయనకు విమానాశ్రయంలో ఆహ్వానం పలికి ఆయనతో కలిసి ఆ కార్యక్రమాలలో పాల్గొనవలసి ఉండగా, జ్వరం వచ్చిందని చెపుతూ వెళ్లలేదు. 

కానీ సిఎం కేసీఆర్‌ హైదరాబాద్‌లోనే ఉంటూ నగరానికి వచ్చిన ప్రధానిని కలవకపోతే విమర్శలు భరించాల్సి వస్తుంది. కనుక ఈసారైనా ప్రధాని మోడీకి సిఎం కేసీఆర్‌ స్వాగతం పలుకుతారా లేక జిల్లాల పర్యటనలు లేదా ఫ్రంట్ ఏర్పాటు పేరుతో వేరే రాష్ట్ర పర్యటనకు వెళ్ళిపోయి మళ్ళీ మొహం చాటేస్తారో చూడాలి.


Related Post