మంత్రి హరీష్‌రావు సంచలన నిర్ణయం...ఏమవుతుందో?

May 17, 2022


img

రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీష్‌రావు సంచలన నిర్ణయం తీసుకొన్నారు. ఇకపై ప్రభుత్వాసుపత్రులలో ప్రైవేట్ మందుల దుకాణాలు ఉంచరాదని నిర్ణయించి ఈ మేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వాసుపత్రులలో చేయించుకొనే నిరుపేద రోగులకు ఉచితంగా మందులు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది రూ.500 కోట్లు కేటాయించింది. కానీ రోగులకు ఆస్పత్రి ద్వారానే ఉచితంగా ఆ మందులను అందించాల్సి ఉండగా, వైద్యులు ఆస్పత్రి ఆవరణలో ఉండే ప్రైవేట్ మందుల దుకాణాలలో మందులు కొనుక్కోవాలని చీటీలు రాసిస్తున్నారు. దీంతో రోగులు అక్కడే డబ్బు చెల్లించి మందులు కొనుక్కోక తప్పడం లేదు. ప్రతీ ఆస్పత్రి ఆవరణలో ఉండే ప్రైవేట్ మందుల దుకాణాలలో నెలకు సుమారు రూ.15-20 లక్షల రూపాయలపైనే మందులు అమ్ముడవుతున్నట్లు అధికారులు గుర్తించారు. ప్రభుత్వం కోట్లు ఖర్చు చేసి రోగులకు ఉచితంగా మందులు పంపిణీ చేస్తున్నా ఈవిదంగా ఎందుకు జరుగుతోందనే మంత్రి హరీష్‌రావు ప్రశ్నకు అధికారులు సమాధానం చెప్పలేక తడబడ్డారు. 

ఆస్పత్రి ఆవరణలో ఉండే ప్రైవేట్ మందుల దుకాణాల యజమానులు, అలాగే వాటికి మందులు సరఫరా చేసే ఫార్మా కంపెనీలు, వాటి సేల్స్ రిప్రజంట్లు ఆస్పత్రులలో కొంత మంది వైద్యులతో కుమ్మక్కవడం వలననే బయట మందులు కొనుగోలు చేయాలని సిఫార్సు చేస్తున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. కనుక వాటిని తక్షణం తొలగించాలని మంత్రి హరీష్‌రావు ఆదేశాలు జారీ చేశారు. 

అయితే ఆస్పత్రులలో మందుల దుకాణాలు ఏర్పాటు చేసుకొని భారీగా డబ్బు సంపాదించుకొంటున్న మందుల దుకాణాల యజమానులు బంగారు గుడ్లు పెట్టే బాతు వంటి తమ వ్యాపారాలను మూసుకొని వెళ్ళిపోతారా? లేక  కోర్టులను ఆశ్రయిస్తారా? అంటే రెండోదే జరుగుతుందని అందరికీ తెలుసు. 

కనుక న్యాయపరమైన చిక్కులను అధిగమించడానికి అవసరమైతే ఆస్పత్రులలో అతి తక్కువ ధరలకు మందులు అమ్మే జెనిరిక్ మందుల దుకాణాలు ఏర్పాటు చేయించాలని అధికారులు మంత్రి హరీష్‌రావుకి సూచించినట్లు తెలుస్తోంది. 


Related Post