అందుకే టిఆర్ఎస్‌ కూడా ప్రచారం చేస్తోంది: మంత్రి హరీష్‌రావు

October 22, 2021


img

హుజూరాబాద్‌ ఉపఎన్నికల ఇన్‌ఛార్జ్ మంత్రి హరీష్‌రావు గురువారం నియోజకవర్గంలో వావిలాలలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నప్పుడు మీడియా ప్రతిధులు అడిగిన కొన్ని ప్రశ్నలకు తనదైన శైలిలో సమాధానాలు ఇచ్చారు. 

“ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి, రెండు సార్లు మంత్రిగా చేసిన ఈటల రాజేందర్‌ను టిఆర్ఎస్‌ అభ్యర్ధి గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ ఎదుర్కొని ఓడించగలరా?” అనే ప్రశ్నకు సమాధానంగా “2004లో ఈటల రాజేందర్‌ అప్పటి మంత్రి ముద్దసాని దామోదర్ రెడ్డిపై ఈటల రాజేందర్‌ పోటీ చేసినప్పుడు ఆయనా ఓ అనామకుడే. కానీ ప్రజలు కేసీఆర్‌ను, గులాబీ జెండాను చూసి ఈటలకు ఓట్లేసి గెలిపించారు. అప్పటి నుంచి ఆయన ఆవిదంగానే నెగ్గుకొస్తున్నారు తప్ప నియోజకవర్గానికి చేసిందేమీ లేదు. కానీ తెలంగాణ ఉద్యమాలలో పాల్గొని, హుజూరాబాద్‌ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవాలనే తపన కలిగిన గెల్లు శ్రీనివాస్ యాదవ్‌, ఈటల రాజేందర్‌ కంటే వందరెట్లు సమర్దుడు. పైగా హుజూరాబాద్‌ నియోజకవర్గం టిఆర్ఎస్‌కు కంచుకోట కనుక ఈ ఉపఎన్నికలో ప్రజలు మా అభ్యర్ధికే ఓట్లు వేసి భారీ మెజార్టీతో గెలిపించబోతున్నారు,” అని చెప్పారు.        

“హుజూరాబాద్‌ కోసమే దళిత బంధు తెచ్చారనే ప్రతిపక్షాల వాదనపై మీ స్పందన ఏమిటి?” అనే ప్రశ్నకు “ఇప్పటి వరకు మా ప్రభుత్వం అనేక పధకాలు తెచ్చింది. అవన్నీ ప్రజల కోసమే కదా?అప్పుడు వాటిని గట్టిగా సమర్దించిన ఈటల రాజేందర్‌ ఇప్పుడు దళిత బంధుని వ్యతిరేకిస్తూ ఈసీకి ఎందుకు లేఖ వ్రాశారు?ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా హుజూరాబాద్‌ ఉపఎన్నిక పూర్తయిన తరువాత దళిత బంధు పధకాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలుచేస్తాం. దళితులకు మేలు చేసేందుకు సిఎం కేసీఆర్‌ ప్రవేశపెట్టిన ఈ పధకంపై ప్రతిపక్షాలు రాజకీయాలు చేస్తూ అడ్డుకోవాలనుకోవడం చాలా బాధాకరం. అటువంటి వారికి ప్రజలు ఎందుకు ఓట్లు వేయాలో ఆలోచించుకోవాలి,” అని అన్నారు. 

“హుజూరాబాద్‌లో ఇంత సుదీర్గంగా టిఆర్ఎస్‌ ఎందుకు ప్రచారం చేస్తోంది?” అనే ప్రశ్నకు సమాధానంగా “నిజానికి ఇది ఓ ప్రత్యేక ఎన్నిక. నోటిఫికేషన్‌ ఎప్పుడు వస్తుందో తెలియక మునుపే హుజూరాబాద్‌లో బిజెపి (ఈటల రాజేందర్‌) ఎన్నికల ప్రచారం మొదలుపెట్టడంతో మేము వెనకబడిపోకూడదనే ఉద్దేశ్యంతో ప్రచారం మొదలుపెట్టాము,” అని మంత్రి హరీష్‌రావు చెప్పారు.     Related Post