ఈటలా...దమ్ముంటే రా: మంత్రి హరీష్‌రావు సవాల్

October 13, 2021


img

హుజూరాబాద్‌ ఉపఎన్నిక టిఆర్ఎస్‌, బిజెపి అభ్యర్ధుల మద్య జరుగుతునట్లు కాక మంత్రి హరీష్‌రావుకు ఈటల రాజేందర్‌కు మద్య జరుగుతున్నట్లుంది. గత రెండు నెలలుగా కరీంనగర్‌లోనే మకాం వేసిన మంత్రి హరీష్‌రావు, ఈటల రాజేందర్‌లు నిత్యం పరస్పర విమర్శలు, ఆరోపణలు చేసుకొంటూనే ఉన్నారు. 

తాజాగా పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెరుగుదలపై మంత్రి హరీష్‌రావు కేంద్రప్రభుత్వాన్ని, బిజెపిని, ఈటల రాజేందర్‌కు ముడిపెట్టి విమర్శలు గుప్పించారు. దీంతో ఈటల రాజేందర్‌ కూడా ఘాటుగా స్పందిస్తూ, పెట్రో ఉత్పత్తులపై రాష్ట్ర ప్రభుత్వం వసూలు చేస్తున్న పన్ను తగ్గించుకొంటే ధరలు తగ్గుతాయని, కానీ మంత్రి హరీష్‌రావు హుజూరాబాద్‌ ప్రజలను తనకు, బిజెపికి వ్యతిరేకంగా రెచ్చగొట్టేందుకు ఈవిదంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. ఒక్కో గ్యాస్ సిలెండరుపై రాష్ట్ర ప్రభుత్వం రూ.291 పన్ను వసూలుచేసుకొంటోందని దానిని ఎందుకు వదులుకోవడం లేదని ప్రశ్నించారు. 

ఈటల ప్రశ్నపై మంత్రి హరీష్‌రావు తిరిగి స్పందిస్తూ, గ్యాస్ సిలెండరుపై రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా తీసుకోవడంలేదన్నారు. ఈటల తన ఈ ఆరోపణను నిరూపించాలని సవాల్ మంత్రి హరీష్‌రావు విసిరారు. హుజూరాబాద్‌ అంబేడ్కర్ విగ్రహం వద్దకు లేదా జమ్మికుంటలో గాంధీ విగ్రహం వద్దకు వచ్చి దీనిపై బహిరంగ చర్చలో పాల్గొనాలని సవాల్ విసిరారు. ఈటల ఇటువంటి తప్పుడు ఆరోపణలు మానుకోవాలని మంత్రి హరీష్‌రావు సూచించారు.


Related Post