తెలంగాణ రైతన్నలకు శుభవార్త!

August 02, 2021


img

తెలంగాణ రైతన్నలకు శుభవార్త! రూ.50,000 లోపు పంట రుణాలను మాఫీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సిఎం కేసీఆర్‌ అధ్యక్షతన నిన్న ప్రగతి భవన్‌లో జరిగిన మంత్రివర్గ సమావేశంలో శాసనసభ ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు ఈనెల 15 నుంచి 31వ తేదీలోగా రూ.50,000 లోపుగల పంట రుణాలను మాఫీ చేయాలని నిర్ణయించారు. 

దీంతో రాష్ట్రవ్యాప్తంగా సుమారు ఆరు లక్షల మంది రైతులు లబ్ది పొందనున్నారు. ఇదివరకే మూడు లక్షల మంది రైతులకు రూ.25,000లోపు పంట రుణాలను ప్రభుత్వం మాఫీ చేసింది. కానీ తరువాత కరోనా వచ్చిపడటంతో అన్నిటితోపాటు పంట రుణాల మాఫీ ప్రక్రియ కూడా నిలిచిపోయింది. ఇప్పుడు రూ.50,000 లోపు రుణాలను మాఫీ చేసిన తరువాత వీలువెంబడి లక్ష రూపాయలలోపు పంట రుణాలను కూడా దశలవారీగా మాఫీ చేయాలని మంత్రిమండలి నిర్ణయించింది. 

కానీ ప్రభుత్వం లక్ష లోపు పంట రుణాలను మాఫీ చేస్తుందని ఎన్నికలలో హామీ ఇచ్చినందున చాలామంది రైతులు దాని కోసం ఎదురుచూస్తూ ఆ రుణాలను...వాటికి వడ్డీని చెల్లించలేదు. దీంతో కొన్నిచోట్ల తీసుకొన్న పంట రుణం కంటే వడ్డీయే ఎక్కువగా ఉంది. ప్రభుత్వం చెల్లించిన సొమ్ములో వడ్డీ పోగా ఏమైనా మిగిలితే అది రుణంలో తగ్గుతుంది తప్ప పూర్తిగా రుణం తీరకపోవడంతో పంట రుణాల మాఫీ ప్రయోజనం పూర్తిగా నెరవేరడం లేదు. 

లక్ష రూపాయలు లేదా అంతకంటే ఎక్కువ పంట రుణాలను ప్రభుత్వం ఇంకా ఎప్పుడు మాఫీ చేస్తుందో తెలీదు కనుక అప్పటి వరకూ దానిపై వడ్డీ పెరిగిపోతూనే ఉంటుంది. ప్రభుత్వం వాటిని మాఫీ చేస్తుందనే ఆశతో ఎదురుచూస్తున్న రైతులు ఆ అప్పులు తీర్చకపోవడం వలన బ్యాంకులు వారికి మళ్ళీ కొత్త అప్పులు ఇవ్వవు. కనుక వీలైనంత త్వరగా ప్రభుత్వం వారి పంట రుణాలను కూడా మాఫీ చేయాల్సిన అవసరం ఉంది. 


Related Post