పశ్చిమ బెంగాల్లో మళ్ళీ ఉద్రిక్తతలు

May 18, 2021


img

పశ్చిమ బెంగాల్‌ శాసనసభ ఎన్నికల సందర్భంగా అధికార తృణమూల్ కాంగ్రెస్‌, బిజెపిల మద్య ఆధిపత్య పోరు జరిగినప్పుడు ఆ రాష్ట్రంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉండేవి. ఎన్నికలు ముగిసి మళ్ళీ మమతా బెనర్జీ ముఖ్యమంత్రిగా అధికారంలోకి రావడంతో సాధారణ పరిస్థితులు ఏర్పడుతుండగా నిన్న ఆమె మంత్రివర్గంలో ఇద్దరు మంత్రులను, ఒక ఎమ్మెల్యేను, ఒక మాజీ నేతను సిబిఐ అధికారులు అరెస్ట్ చేయడంతో మళ్ళీ ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.

సుమారు ఐదేళ్ళ క్రితం పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ‘నారాద టేప్స్’ వ్యవహారంలో వారిని సిబిఐ అరెస్ట్ చేసింది. అయితే ప్రజామోదంతో మళ్ళీ అధికారంలోకి వచ్చిన తన ప్రభుత్వాన్ని కూలద్రోసేందుకే కేంద్రప్రభుత్వం సిబిఐని తమపై ఉసిగొల్పి అరెస్టులు చేయిస్తోందని ఆరోపిస్తూ సిఎం మమతా బెనర్జీ ఆరోపిస్తున్నారు. ఆమె తన మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ కార్యకర్తలతో కలిసి కోల్‌కతాలోని సిబిఐ కార్యాలయం ముందు బైటాయించి ధర్నా చేయడంతో రాష్ట్రంలో ఒక్కసారిగా మళ్ళీ తీవ్ర ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. దమ్ముంటే తనను అరెస్ట్ చేయాలంటూ మమతా బెనర్జీ సవాల్ చేశారు. కరోనా భయాలను, ఆంక్షలను పక్కన పెట్టి కోల్‌కతా నలుమూలల నుంచి వేలాదిగా పార్టీ కార్యకర్తలు తరలివచ్చి సిబిఐ కార్యాలయంపై రాళ్ళు రువ్వుతూ దాడులు చేశారు. సిఎం మమతా బెనర్జీ సమక్షంలోనే వారు దాడులు చేస్తుండటంతో పోలీసులకు ఏమి చేయాలో పాలుపోక తలలు పట్టుకొన్నారు. ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం వరకు మమతా బెనర్జీ సిబిఐ కార్యాలయం వద్ద ధర్నాకు కూర్చోవడంతో మంత్రుల అరెస్టులను నిరసిస్తూ నిన్న రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాలో నిరసన ర్యాలీలు జరిగాయి. ఆ సందర్భంగా పలు చోట్ల హింసాత్మక ఘటనలు జరిగాయి. 

అరెస్ట్ అయినవారికి సిబిఐ కోర్టు బెయిల్‌పై మంజూరు చేసింది. కానీ సిబిఐ కోర్టు తీర్పు సిబిఐ అధికారులు హైకోర్టులో సవాలు చేస్తూ పిటిషన్‌ వేయడంతో బుదవారం వరకు బెయిల్‌పై స్టే విధించింది. దీంతో పోలీసులు వారిని కోల్‌కతాలో జైలుకి తరలించారు.  

సాక్షాత్ ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఆరాచక పరిస్థితులు సృష్టిస్తున్నారని గవర్నర్‌ జగదీప్ ధన్‌కర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మమతా బెనర్జీ తక్షణం రాష్ట్రంలో పరిస్థితులను అదుపుచేయాలని హెచ్చరించారు. 


Related Post