నల్గొండ ప్రభుత్వాసుపత్రిలో హైటెన్షన్

May 18, 2021


img

నల్గొండ ప్రభుత్వాసుపత్రిలో నిన్న ఆక్సిజన్‌ నిలువలు అడుగంటడంతో ఒక్కసారిగా అంతటా తీవ్ర ఆందోళనకర పరిస్థితులు ఏర్పడ్డాయి. ఒడిశా నుంచి ఆదివారం రావలసిన ఆక్సిజన్‌ ట్యాంకర్ సోమవారం నాటికి కూడా ఆసుపత్రికి చేరకపోవడంతో ఈ సమస్య ఏర్పడింది. అయితే ఇటువంటి పరిస్థితిని ఎదుర్కొనేందుకు సరిపడినన్ని ఆక్సిజన్‌ సిలెండర్లను ముందే సిద్దంగా ఉంచామని ఆసుపత్రి అధికారులు చెప్పడంతో రోగులు, వారి సహాయకులు శాంతించారు. 

ఆసుపత్రి అధికారులు ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్‌ ప్రశాంత్ జీవన్ పాటిల్‌కు తెలియజేయడంతో ఆయన వెంటనే స్పందించి ఒడిశాలోని రావుర్‌ఖిల్లాలోని ఆక్సిజన్‌ ప్లాంట్ అధికారులకు ఫోన్‌ చేసి ట్యాంకర్ గురించి అడిగి తెలుసుకొన్నారు. అది మూడు రోజుల క్రితమే ప్లాంట్ నుంచి బయలుదేరిందని ఈపాటికి ఆసుపత్రికి చేరుకొని ఉండాలని వారు చెప్పడంతో ఆయన వెంటనే జిల్లా ఎస్పీ రంగనాథ్ కు ఫోన్‌ చేసి ఆక్సిజన్‌ ట్యాంకర్ ఎక్కడ ఉందో తెలుసుకొని వీలైనంత త్వరగా ఆసుపత్రికి చేర్చమని ఆదేశించారు. 

ఎస్పీ రంగనాథ్ వెంటనే జిల్లా సరిహద్దులలో పోలీసులకు ఫోన్‌ చేసి పరిస్థితి అడిగి తెలుసుకొన్నారు. ఆక్సిజన్ ట్యాంకర్ జిల్లాలోకి ప్రవేశించినట్లు వారు చెప్పడంతో వెంటనే దానిని గుర్తించి దానికి గ్రీన్‌ ఛానల్ ఏర్పాటు చేసి ఎక్కడా ఆగకుండా ఎస్కార్ట్ వాహనంతో ఆఘమేఘాలపై నల్గొండ ప్రభుత్వాసుపత్రికి చేర్చారు. 

అప్పటికే ఆసుపత్రిలో ఆక్సిజన్ ట్యాంకర్‌ వద్ద సిద్దంగా ఉన్న సిబ్బంది వెంటనే ఆక్సిజన్‌ నింపడంతో మళ్ళీ ఆసుపత్రిలో ఆక్సిజన్‌ సరఫరా సాధారణస్థితికి వచ్చింది. దాంతో ఆసుపత్రి అధికారులు, సిబ్బంది, రొగులు, వారి సహాయకులు అందరూ ఊపిరి పీల్చుకొన్నారు. 


Related Post