నన్ను ఎందుకు అడ్డుకొంటున్నారు? రేవంత్‌ రెడ్డి

May 17, 2021


img

నిన్న (ఆదివారం) కాంగ్రెస్‌ ఎంపీ, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌ రెడ్డి సికింద్రాబాద్‌ గాంధీ ఆసుపత్రితో సహా నగరంలో ఐదు ప్రాంతాలలో పర్యటించేందుకు తన వాహనంలో బయలుదేరగా బేగంపేట పబ్లిక్ స్కూల్ వద్ద పోలీసులు ఆయనను అడ్డుకొని నిలిపివేశారు. రేవంత్‌ రెడ్డి కారు దిగి పోలీసులతో వాగ్వాదానికి దిగడంతో కాసేపు అక్కడ ట్రాఫిక్ జామ్‌ అయ్యింది. 

రేవంత్‌ రెడ్డి పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, “ఎంపీగా ఉన్న నన్ను అడ్డుకోమని మీకు ఎవరు ఆదేశాలు ఇచ్చారు? అసలు నన్ను ఎందుకు అడ్డుకొంటున్నారు? గాంధీ ఆసుపత్రి వద్ద పేదలకు అన్నదానం, తిరుమలగిరిలో కోవిడ్ ఆసుపత్రి వద్ద రోగులకు ఆక్సిజన్‌ సిలెండర్లను అందించేందుకు వెళుతున్నాను తప్ప రాజకీయ కార్యక్రమాల కోసం కాదు. నాకు మరో మూడు చోట్ల ఇటువంటి కార్యక్రమాలున్నాయి. పేదలకు అన్నదానం, రోగులకు ఆక్సిజన్‌ సిలిండర్లు అందించడానికి వెళుతుంటే మీకు అభ్యంతరం ఏమిటి? గాంధీ ఆసుపత్రి వద్ద నిషేధాజ్ఞలు ఉంటే అక్కడ ఆపండి కానీ బేగంపేటలో అడ్డుకోవడం ఏమిటి?”అంటూ రేవంత్‌ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినా పోలీసులు ఆయనను ముందుకు వెళ్ళేందుకు అనుమతించకపోవడంతో అక్కడి నుంచే కమీషనర్ అంజనీకుమార్‌కి ఫోన్‌ చేసి మాట్లాడిన తరువాత తిరుమలగిరికి మాత్రం వెళ్ళేందుకు అనుమతించడంతో రేవంత్‌ రెడ్డి వెళ్ళిపోయారు. 

మంత్రి గంగుల కమలాకర్ కరీంనగర్‌లో టిఆర్ఎస్‌ శ్రేణులతో వరుస సమావేశాలకు పోలీసులు అభ్యంతరం చెప్పడం లేదు. కానీ కరోనా రోగులు, వారి సహాయకులకు సాయపడదామని రేవంత్‌ రెడ్డి బయలుదేరితే అడ్డుకొన్నారు. ప్రతిపక్ష నేతల కదలికలను నియంత్రించడం ద్వారా అధికార పార్టీ ఏమి సాధించాలనుకొంటోందో దానికే తెలియాలి. అధికార పార్టీ నేతలకు లేని ఆంక్షలు ప్రతిపక్ష నేతలకు ఎందుకో తెలీదు. 


Related Post