ఒకవేళ ఈటల రాజీనామా చేస్తే...నేనే పోటీ చేస్తా!

May 06, 2021


img

ఆలూ లేదు చూలు లేదు అల్లుడిపేరు సోమలింగం అన్నట్లు...మాజీ మంత్రి ఈటల రాజేందర్‌-టిఆర్ఎస్‌ మద్య యుద్ధం ఇంకా కొనసాగుతుండగానే రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతరావు హుజూరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ, “ఆయన పార్టీలో నేతలకు, కార్యకర్తలకు చాలా ఇబ్బంది కలిగించారు. సిఎం కేసీఆర్‌ ఆయనను ఆదరించి మంత్రి పదవులిచ్చి గౌరవిస్తే ఇప్పుడు ఆయననే విమర్శిస్తున్నారు. కనుక ఒకవేళ ఈటల రాజేందర్‌ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం వలన ఉపఎన్నికలు వచ్చినట్లయితే, ఆయనపై నేను పోటీ చేసి గుణపాఠం నేర్పించాలనుకొంటున్నాను,” అని అన్నారు.

అయితే కేసీఆర్ శిష్యరికంలో రాజకీయాలలో ఆరితేరిన ఈటల ఆవేశంతో ఇప్పటికిప్పుడు రాజీనామా చేసే అవకాశం లేదనే చెప్పవచ్చు. ఎందుకంటే టిఆర్ఎస్‌ ఎమ్మెల్యేగా ఉంటూ పార్టీ అధిష్టానంపై చేసే విమర్శలకు, ఆరోపణలకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఒకవేళ ఆయనపై టిఆర్ఎస్‌ నేతలు విమర్శలు గుప్పిస్తే మళ్ళీ ఆయన సమాధానం చెపుతుంటారు కనుక ఇది టిఆర్ఎస్‌ పార్టీలో సంక్షోభంలా కనిపిస్తుంటుంది. ఈ కారణంగా మీడియా దృష్టి కూడా ఆయనపైనే ఉంటుంది కనుక ఆయన చేసే విమర్శలు, చెప్పే మాటలు ప్రజలకు చేరుతుంటాయి. అదే...రాజీనామా చేస్తే వెంటనే టిఆర్ఎస్‌ నుంచి బహిష్కరింపబడే అవకాశం ఉంది. అప్పుడు రాష్ట్రంలో ఉన్న అనేకమంది రాజకీయ నేతలలో ఈటల కూడా అవుతారు కనుక ఆయనకు ప్రాధాన్యత తగ్గుతుంది. కనుక టిఆర్ఎస్‌ ఎమ్మెల్యేగా ఉంటూనే ఆ పార్టీ నేతలతో, సిఎం కేసీఆర్‌ యుద్ధం కొనసాగించే అవకాశం ఉంది. ఒకవేళ టిఆర్ఎస్‌ పార్టీ నుండి బహిష్కరింపబడితే అప్పుడు లాభనష్టాలు బేరీజు వేసుకొని రాజీనామా చేస్తే చేయవచ్చు లేకుంటే లేదు. కనుక ఉపఎన్నికల గురించి ఇప్పుడే ఆలోచించడం తొందరపాటే అవుతుంది.


Related Post