సీఎస్ సోమేష్ వాస్తవాలు చెప్పాలి: డికె అరుణ

May 06, 2021


img

కరోనా కట్టడికి హైకోర్టు చేసిన సూచనలపై ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేష్ కుమార్‌ స్పందిస్తూ రాష్ట్రంలో బెడ్లు, మందులు, రెమిడిసివిర్‌ ఇంజక్షన్లు, ఆక్సిజన్‌ దేనికీ కొరత లేదని చెప్పడాన్ని బిజెపి నేత డికె అరుణ తప్పు పట్టారు. గద్వాల్ జిల్లా కేంద్రంలో నిన్న మీడియాతో మాట్లాడుతూ, “రాష్ట్రంలో ఓ పక్క ఆసుపత్రులలో బెడ్లు, మందులు, ఆక్సిజన్‌ దొరక్క కరోనా రోగులు విలవిలలాడుతుంటే, సోమేష్ కుమార్‌ రాష్ట్రంలో దేనికీ కొరత లేదని, ప్రభుత్వం కరోనాను అద్భుతంగా కట్టడి చేస్తోందని చెప్పడం చాలా హాస్యాస్పదంగా ఉంది. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో కరోనా కేసులు తక్కువగా ఉన్నందునే ఆయన ఈవిదంగా మాట్లాడుతున్నారని భావిస్తున్నాను. ఇది సిగ్గుపడవలసిన విషయం. రాష్ట్రంలో కరోనా రోగులు, వారి కుటుంబ సభ్యులు, బందుమిత్రులు ఎన్ని బాధలు పడుతున్నారో రోజూ మీడియాలో వార్తలు వస్తున్నా సోమేష్ కుమార్‌ ఈవిదంగా మాట్లాడటం చాలా శోచనీయం. ఇటువంటి కష్టకాలంలో ప్రభుత్వం ప్రజలకు భరోసా కల్పించాలి కానీ భ్రమింపజేయాలని చూస్తోంది. కరోనా కట్టడిలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. ఇకనైనా ప్రభుత్వం మేల్కొని యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకొని రాష్ట్ర ప్రజలను ఆదుకోవాలి,” అని డికె.అరుణ సూచించారు. 


Related Post