రేపటి నుంచి తెలంగాణలో థియేటర్లు బంద్‌

April 20, 2021


img

సినిమా కష్టాలంటే ఇవేనేమో... ఆర్నెల్లు లాక్‌డౌన్‌ తరువాత రాష్ట్రంలో సినిమా థియేటర్లు నవంబరులో తెరుచుకొన్నాయి. మళ్ళీ రేపటి నుంచి మూతపడనున్నాయి.

రాష్ట్రంలో కరోనా మహమ్మారి మళ్ళీ విజృంభించడంతో, సినిమా థియేటర్ల యజమానులు, డిస్ట్రిబ్యూటర్లు హైదరాబాద్‌లో సమావేశమయ్యి చర్చించారు. ప్రేక్షకుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని రేపటి నుంచి కొన్ని రోజుల పాటు రాష్ట్రంలో అన్ని థియేటర్లు మూసివేయాలని నిర్ణయించారు. అయితే భారీ బడ్జెట్‌తో నిర్మించిన పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమా ఆడుతున్న థియేటర్లకు మాత్రం మినహాయింపునివ్వాలని నిర్ణయించారు.    

ఫిబ్రవరి నుంచి కరోనా తీవ్రత పెరుగుతుండటంతో తెలుగు సినీపరిశ్రమలో ప్రతీ ఒక్కరూ ఆందోళన చెందారు. అయితే ఎట్టి పరిస్థితులలో షూటింగులు నిలిపివేయమని, సినిమా థియేటర్లు మూసివేయమని రాష్ట్ర ప్రభుత్వం పదేపదే సినీ పరిశ్రమకు ధైర్యం చెప్పింది. కానీ ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్లు , సినిమా థియేటర్ల యజమానులే స్వయంగా ఈ నిర్ణయం తీసుకోవలసివచ్చింది పాపం. 

దీంతో సినిమా థియేటర్లలో పనిచేసే సిబ్బంది, థియేటర్ల యజమానులు, కోట్లు చెల్లించి సినిమాలు కొనుగోలు చేసిన డిస్ట్రిబ్యూటర్లు తీవ్రంగా నష్టపోతారు. థియేటర్లు మూతపడితే రిలీజ్ కావలసిన సినిమాలు నిలిచిపోతాయి కనుక నిర్మాతలు నష్టపోతారు. అలాగే సినిమా షూటింగులు క్రమంగా నిలిచిపోతాయి. అప్పుడు మళ్ళీ సినీపరిశ్రమపై ఆధారపడిన ప్రతీఒక్కరు నష్టపోతారు. అయితే ప్రస్తుత పరిస్థితులలో థియేటర్లు మూసువేయడం తప్ప వేరే గత్యంతరం కూడా లేదు. కనుక సినీ పరిశ్రమకు మళ్ళీ సినిమా కష్టాలు మొదలయ్యాయని భావించవచ్చు. ఇది చాలా బాధాకరమైన విషయమే.


Related Post