భారత్‌లో రోజుకి 3 లక్షల పాజిటివ్ కేసులు

April 19, 2021


img

గత ఏడాది కరోనా గురించి ఏమాత్రం అవగాహన లేనప్పుడు దానిని అద్భుతంగా కట్టడిచేసిన భారత్‌, ఇప్పుడు దారుణంగా విఫలమవుతుండటం విస్మయం కలిగిస్తోంది. గత 24 గంటలలో దేశవ్యాప్తంగా కొత్తగా 2,73,810 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అంటే మరో ఒకటి రెండు రోజులలో ఆ సంఖ్య 3 లక్షలు దాటిపోనుందని స్పష్టమవుతోంది. రోజుకి 3 లక్షలు చొప్పున కేసులు నమోదవుతుంటే నెలకు కోటిమంది కరోనా బారినపడటం అనివార్యం...దాంతో మరణాల సంఖ్య పెరిగిపోవడం ఖాయం. ఈ పరిస్థితికి ఎవరు కారణం? ఎక్కడ లోపం జరుగుతోంది? అనే సందేహాలకు కళ్లెదుటే సమాధానాలున్నాయి. తిలాపాపం తలా పిడికెడు అన్నట్లు, కేంద్రరాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలు, ప్రజల నిర్లక్ష్యం, రాజకీయ పార్టీలు తమ రాజకీయ ప్రయోజనాల కోసం ఎన్నికల సందర్భంగా జనాలను పోగేసి సభలు, ర్యాలీలు నిర్వహించడం, లక్షల మందితో కుంభమేళా నిర్వహించడం వంటివి అనేకం కనిపిస్తున్నాయి. కనుక ఈ దుస్థితికి అందరూ కారణమనే చెప్పాలి.  

కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించిన తాజా లెక్కల ప్రకారం... 

• గత 24 గంటలలో దేశవ్యాప్తంగా బయటపడిన పాజిటివ్ కేసులు: 2.73 లక్షలు 

• దేశంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం పాజిటివ్ కేసులు: 1.51 కోట్లు 

• గత 24 గంటలలో దేశవ్యాప్తంగా కోలుకొన్నవారి సంఖ్య: 1.45 లక్షల మంది 

• దేశంలో మొత్తం కోలుకొన్నవారి సంఖ్య: 1.30 కోట్లు 

• గత 24 గంటలలో దేశవ్యాప్తంగా మరణించిన వారి సంఖ్య: 1,619

• దేశంలో ఇప్పటివరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య: 1.79 లక్షలు

• దేశంలో మొత్తం యాక్టివ్ కేసులు:19.30 లక్షలు

• గత 24 గంటలలో దేశవ్యాప్తంగా జరిపిన కరోనా పరీక్షలు: 13.56 లక్షలు 

• ఇప్పటి వరకు కరోనా వాక్సిన్ వేసుకొన్నవారి సంఖ్య:12.39 కోట్లు

• గత 24 గంటలలో కరోనా వాక్సిన్లు వేయించుకొన్నవారి సంఖ్య: 12.30 లక్షలు 

• రికవరీ రేటు: 86.62 శాతం 


Related Post