దుర్గ్, రాయ్‌పూర్‌లో పదిరోజులు సంపూర్ణ లాక్‌డౌన్

April 07, 2021


img

ఛత్తీస్‌ఘడ్‌ రాజధాని రాయ్‌పూర్‌లో శుక్రవారం నుంచి 10 రోజులపాటు సంపూర్ణ లాక్‌డౌన్‌ విధిస్తున్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. రాజధానితో సహా రాష్ట్రవ్యాప్తంగా రోజురోజుకీ కరోనా కేసులు పెరిగిపోతుండటంతో ఈ నిర్ణయం తీసుకొన్నట్లు ఛత్తీస్‌ఘడ్‌ ముఖ్యమంత్రి భూపేష్ బాగేల్ వైద్య తెలిపారు. ముఖ్యంగా రాయ్‌పూర్‌కి సుమారు 40 కిమీ దూరంలో ఉన్న దుర్గ్ జిల్లాలో వందలాదిమంది కరోనా బారినపడుతుండటంతో ప్రభుత్వాసుపత్రులు వారికి వైద్యం అందించలేకపోతున్నాయి. కనుక దుర్గ్ జిల్లాలో సోమవారం నుంచి ఈనెల 14వరకు ప్రభుత్వం సంపూర్ణ లాక్‌డౌన్‌ విధించింది. మంగళవారం ఒక్కరోజే ఛత్తీస్‌ఘడ్‌ రాష్ట్రంలో 9,921 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో 3,86,269 పాజిటివ్ కేసులు నమోదు కాగా, వాటిలో 52,445 యాక్టివ్ కేసులున్నట్లు ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. 

మహారాష్ట్రలో కూడా కరోనా తీవ్రత చాలా ఆందోళనకరంగా మారడంతో పలు జిల్లాలలో లాక్‌డౌన్‌, నైట్ కర్ఫ్యూలు అమలుచేస్తోంది అక్కడి ప్రభుత్వం. తెలంగాణలో కూడా కరోనా కేసులు రోజురోజుకీ శరవేగంగా పెరుగుతున్నందున కరోనా కట్టడికి మరింత గట్టిగా ప్రయత్నిస్తాము తప్ప లాక్‌డౌన్‌ విధించమని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ ఈరోజు ప్రకటించారు. 


Related Post