టిఆర్ఎస్‌ను ఓడిస్తేనే హామీలు అమలవుతాయి: బండి

March 08, 2021


img

రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌ నిన్న హైదరాబాద్‌లోని రామాంతాపూర్, నాచారంలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన టిఆర్ఎస్‌ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. “ఎన్నికల సమయంలో టిఆర్ఎస్‌ ఇచ్చిన హామీలు అమలుచేయకుండా సిఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ ప్రజలను మాయమాటలతో మభ్యపెడుతున్నారు. ఎన్నికల హామీలపై బిజెపి గట్టిగా ప్రశ్నించడం మొదలుపెట్టిన తరువాతే టిఆర్ఎస్‌ ప్రభుత్వం వాటి గురించి మాట్లాడుతోంది. ఎన్నికలకు ముందు, ఎన్నికల సమయంలో ఉద్యోగుల పీఆర్సీ, ఉద్యోగాల నోటిఫికేషన్లు, నిరుద్యోగ భృతి గురించి టిఆర్ఎస్‌ మంత్రులు మాట్లాడుతుంటారు. ఆ తరువాత వాటిని పట్టించుకోరు. కనుక ఈ ఎన్నికలలో బిజెపిని గెలిపించి టిఆర్ఎస్‌ను ఓడిస్తేనే ఆ హామీలన్నిటినీ అమలుచేస్తుంది.

కేంద్రంపై బురద జల్లి ఎన్నికలలో గెలవాలని టిఆర్ఎస్‌ నేతలు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. కానీ కేంద్రప్రభుత్వం రాష్ట్రాభివృద్ధికి ఇస్తున్న నిధులను సిఎం కేసీఆర్‌ పక్కదారి పట్టిస్తున్నారు. ప్రాజెక్టుల పేరుతో కమీషన్లు దండుకొంటున్నారు. ముఖ్యంగా... రాష్ట్రానికి కొత్త పరిశ్రమలు, సంస్థలు తరలిరావడం, వాటిలో ఉద్యోగాల కల్పన విషయంలో మంత్రి కేటీఆర్‌ చెపుతున్నవన్నీ అబద్దాలే. కేసీఆర్‌ పాలనలో ప్రభుత్వోద్యోగులు, ఉపాధ్యాయులు, ఆర్టీసీ కార్మికుల బతుకులు నానాటికీ అధ్వానంగా మారుతున్నాయి. అయినా ఎవరూ నోరెత్తి మాట్లాడలేని పరిస్థితులు నెలకొన్నాయి. ఈ పరిస్థితులు మారాలంటే ఎమ్మెల్సీ ఎన్నికలలో బిజెపికి ఓట్లేసి గెలిపించాలి,” అని అన్నారు.


Related Post