మేకిన్ ఇండియా అని భజన చేస్తే సరిపోదు: కేటీఆర్‌

March 05, 2021


img

ఈరోజు హైదరాబాద్‌ బేగంపేటలో జరిగిన సిఐఐ వార్షిక సదస్సులో పాల్గొన్న రాష్ట్ర ఐ‌టి శాఖ మంత్రి కేటీఆర్‌ పారిశ్రామికవేత్తలను ఉద్దేశ్యించి చేసిన ప్రసంగంలో కేంద్రప్రభుత్వానికి గట్టిగా చురకలు వేశారు. “ తెలంగాణ రాష్ట్రం ఏర్పడి కేవలం ఆరున్నరేళ్ళు అయ్యింది. ఇంత తక్కువ సమయంలోనే తెలంగాణ ఐ‌టి, ఫార్మా, లైఫ్ సైన్సస్, నిర్మాణ, వ్యవసాయ రంగాలలో ఎంతగానో అభివృద్ధి సాధించి దేశంలో అగ్రస్థానంలో నిలుస్తోంది. తెలంగాణ రాష్ట్రం నుంచి ఐ‌టి ఎగుమతుల విలువే రూ.1.40 లక్షల కోట్లు ఉంది. ఇంకా అభివృద్ధి సాధించాలనే ఉద్దేశ్యంతో స్టార్టప్‌ కంపెనీలను ప్రోత్సహిస్తున్నాము. తెలంగాణ రాష్ట్రంలో ఇన్నోవేషన్ హబ్‌గా మారుతోంది. ఫార్మా రంగంలో కూడా హైదరాబాద్‌ దేశంలో అగ్రస్థానంలో ఉంది. ఈ ఆరేళ్ళలోనే రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి ఊతమిచ్చే అనేక అభివృద్ధి పనులు, సంక్షేమ పధకాలు చేపట్టడంతో ఆ రంగంలో కూడా తెలంగాణ దేశంలో అగ్రస్థానానికి చేరుకొంటోంది. హైదరాబాద్‌లో డిఫెన్స్, ఏరో స్పేస్ రంగాలు కూడా శరవేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. 

గత ఆరేళ్ళలో హైదరాబాద్‌ నగరానికి అనేక జాతీయ, అంతర్జాతీయ సంస్థలు వచ్చాయి. అయితే ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వం అవలంభిస్తున్న నూతన విధానాలు, ప్రోత్సాహకాల వలననే సాధ్యం అయ్యింది తప్ప కేంద్రప్రభుత్వం చేసిందేమీ లేదు. కేవలం మేకిన్ ఇండియా... ఆత్మ నిర్భర్ భారత్‌ అని నినాదాలు చేస్తే సరిపోదు...రాష్ట్రాలకు పరిశ్రమలు, పెట్టుబడులు వచ్చేందుకు కేంద్రం అన్నివిదాల సహకరిస్తుండాలి. రాష్ట్రవిభజన హామీలలో కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారంలో స్టీల్ ఫ్యాక్టరీలు ఏర్పాటు చేస్తామన్నారు కానీ చేతులెత్తేశారు. ఐ‌టిఐఆర్ ఇస్తామన్నారు కానీ రద్దు చేశామని ప్రకటించారు. కేంద్రం హామీలు ఇచ్చి మాట తప్పితే రాష్ట్ర ప్రభుత్వం ఎవరిని అడగాలి? తెలంగాణ రాష్ట్రం నుంచి కేంద్రానికి పన్నుల రూపంలో భారీగా ఆదాయం సమకూరుతున్నప్పటికీ రాష్ట్రం పట్ల వివక్ష చూపుతూనే ఉండటం చాలా బాధాకరం. ఎల్లప్పుడూ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొనే హామీలు, ప్రకటనలు చేస్తుంటే ఎటువంటి ప్రయోజనమూ ఉండదు. దేశాభివృద్ధి, ప్రజా సంక్షేమం లక్ష్యంగా కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు పనిచేసినప్పుడే సత్ఫలితాలు కనిపిస్తాయి. సిఎం కేసీఆర్‌ నాయకత్వంలో మా ప్రభుత్వం ఆవిదంగా పనిచేస్తోంది కనుకనే తెలంగాణ రాష్ట్రంలో కేవలం ఆరేళ్ళలో అన్ని రంగాలలో అభివృద్ధి సాధించగలిగామని సగర్వంగా చెపుతున్నాను. బుల్లెట్ రైల్‌ వేసేందుకు ఒక్క గుజరాత్‌ మాత్రమే పనికివస్తుందా...హైదరాబాద్‌కు ఆ అర్హత లేదా?” అని కేటీఆర్‌ అన్నారు.


Related Post