హైదరాబాద్‌ మేయర్ ఎన్నికకు నోటిఫికేషన్‌ జారీ

January 23, 2021


img

జీహెచ్‌ఎంసీ మేయర్, డెప్యూటీ మేయర్ ఎన్నికను సన్నాహాలు ప్రారంభం అయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం కమీషనర్ సి.పార్ధసారధి శుక్రవారం నోటిఫికేషన్‌ జారీ చేశారు. 

వచ్చే నెల 11వ తేదీ ఉదయం 11 గంటలకు కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లు జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో సమావేశమై ప్రమాణస్వీకారం చేస్తారు. అనంతరం మధ్యాహ్నం 12.30 గంటలకు మొదట మేయర్‌ను, తరువాత డెప్యూటీ మేయర్‌ను ప్రత్యక్ష పద్దతిలో ఎన్నుకొంటారు. మ్యాజిక్ ఫిగర్‌తో సంబందం లేకుండా మెజారిటీ సభ్యుల మద్దతు లభించినవారికి మేయర్, డెప్యూటీ మేయర్ పదవులు దక్కుతాయి. ఈ ప్రక్రియలో కార్పొరేటర్లతో పాటు ఎక్స్‌ అఫీషియో సభ్యులు కూడా పాల్గొంటారు. ఈ ప్రక్రియకు గ్రేటర్ పరిధిలోని ఏదైనా ఓ జిల్లా కలెక్టర్ ప్రిసైడింగ్ ఆఫీసరుగా వ్యవహరిస్తారు.  

సాధారణంగా ఈ సమావేశానికి తగినంతమంది (కోరం) సభ్యులు హాజరైనట్లయితే మొదటిరోజునే మేయర్, డెప్యూటీ మేయర్ ఎన్నిక పూర్తవుతుంది. ఒకవేళ కోరం లేకపోతే మరుసటి రోజు మళ్ళీ సమావేశం నిర్వహించి ఎన్నికొంటారు. రెండోరోజు కూడా కోరం లేకపోతే రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించిన తేదీన మరోసారి సమావేశం జరుగుతుంది. ఆ సమావేశంలో ఎంతమంది హాజరైతే వారితోనే మేయర్, డెప్యూటీ మేయర్ ఎన్నికను నిర్వహిస్తారు.   

ఇటీవల జరిగిన గ్రేటర్ ఎన్నికలలో ఏ పార్టీకి పూర్తి మెజార్టీ లభించలేదు. టిఆర్ఎస్‌-56, బిజెపి-48, మజ్లీస్‌-44, కాంగ్రెస్‌-2 సీట్లు గెలుచుకొన్నాయి. అయితే మేయర్, డెప్యూటీ మేయర్ పదవులను గెలుచుకొనేందుకు తగినంతమంది కార్పొరేటర్లు లేనప్పుడు పార్టీలు తమ ఎక్స్‌అఫీషియో సభ్యుల ఓట్లను వినియోగించుకొనే వెసులుబాటు ఉంది. కనుక 28మంది ఎక్స్‌అఫీషియో సభ్యులున్న టిఆర్ఎస్‌ అవలీలగా రెండు పదవులను దక్కించుకోగలదు. జీహెచ్‌ఎంసీ తొలిసమావేశానికి నోటిఫికేషన్‌ విడుదలైనందున అన్ని పార్టీల ఎక్స్‌అఫీషియో సభ్యులు తమ వివరాలను నమోదు చేసుకొనే ప్రక్రియ ప్రారంభం అయ్యింది.

ఇంతకాలం మిత్రపక్షాలుగా వ్యవహరిస్తూ పరస్పరం సహకరించుకొంటున్న మజ్లీస్‌, టిఆర్ఎస్‌లు గ్రేటర్ ఎన్నికలలో దూరం పాటించినప్పటికీ మేయర్, డెప్యూటీ మేయర్ ఎన్నికలలో మళ్ళీ చేతులు కలిపితే 48 సీట్లు గెలుచుకొని టిఆర్ఎస్‌ తరువాత రెండో స్థానంలో ఉన్న బిజెపికి డెప్యూటీ మేయర్ పదవి దక్కించుకోవడం కష్టమే. 


Related Post