రేవంత్‌ రెడ్డికి మళ్ళీ సమస్యలు?

August 26, 2019


img

మల్కాజ్‌గిరి కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌ రెడ్డికి మళ్ళీ ఓటుకు నోటుకు కేసు సమస్యలు మొదలుకానున్నాయా? అంటే అవుననే అనిపిస్తోంది. తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ ఆదివారం రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీని కలిసి ఓటుకు నోటు, నయీమ్ కేసులలో ఎటువంటి పురోగతి లేకుండా ఉండిపోయాయని రెంటినీ వీలైనంత త్వరగా ముగించాలని కోరుతూ వినతిపత్రం ఇచ్చారు.

గత ఐదున్నరేళ్లుగా సాగుతున్న ఓటుకు నోటుకు కేసులో ప్రధాన నిందితుడిగా పేర్కొనబడిన రేవంత్‌ రెడ్డి పార్లమెంటులో ఎంపీగా వ్యవహరిస్తున్నారని, ఇది సరికాదని కనుక తక్షణం ఈకేసు దర్యాప్తు ముగించి దోషులకు శిక్షలు పడేలా చేయాలని కోరారు. ఇదే కేసులో ఏపీ మాజీ సిఎం చంద్రబాబునాయుడు కూడా నిందితుడిగా ఉన్నారని, ఈ కేసులో ఆయన పాత్ర ఏమిటో తేల్చాలని కోరారు. 

అలాగే గ్యాంగ్‌స్టర్ నయీముద్దీన్ కేసులను గత నాలుగున్నరేళ్ళుగా పరిష్కరించకుండా సాగదీయడం సరికాదని, ఆ కేసులలో వేలకోట్లు ఆస్తుల వ్యవహారాలు కూడా ఇమిడి ఉన్నాయని, కనుక తక్షణం వాటిపై కూడా తగు చర్యలు తీసుకొని బాధితులకు న్యాయం చేకూర్చాలని వినతిపత్రం ద్వారా కోరారు. ఈ రెండు కేసుల పురోగతిపై సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించాలని ఎర్ర సత్యనారాయణ కోరారు.

ఒకవేళ రాష్ట్ర కాంగ్రెస్‌ను తెరాస ఇంకా దెబ్బతీయాలని నిశ్చయించుకుంటే, ఈ వినతిపత్రం అందుకు పనికివస్తుంది. అప్పుడు ఓటుకు నోటు కేసులో మళ్ళీ కదలిక మొదలవుతుంది. లేకుంటే రేవంత్‌ రెడ్డికి ఎటువంటి ఇబ్బందీ ఉండకపోవచ్చు.


Related Post