టీజీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్-1 పరీక్షలకు సంబంధించి దాఖలైన కేసుపై నేడు జస్టిస్ నామవరపు రాజేశ్వర్ రావు విచారణ జరిపారు. గ్రూప్-1 అభ్యర్ధుల తరపున రచనా రెడ్డి, టీజీపీఎస్సీ తరపున రాజశేఖర్ తమ వాదనలు వినిపించారు.
గ్రూప్-1 పరీక్షల నిర్వహణలో అనేక అవకతవకలు జరిగాయని, రీకౌంటింగులో ఓ అభ్యర్ధికి ఏకంగా 60 మార్కులు తగ్గడమే ఇందుకు నిదర్శనమంటూ రచనా రెడ్డి వాదించగా, ఆ అభ్యర్ధి తాలూకు జవాబు పత్రాలు, రీ కౌంటింగ్ వివరాలు సమర్పించాలని టీజీపీఎస్సీ తరపు న్యాయవాదిని హైకోర్టు ఆదేశించింది. వాటిని సమర్పిస్తామని కానీ హైకోర్టు సెలవులు మొదలయ్యే లోగా తుది తీర్పు వెలువరించాలని రాజశేఖర్ అభ్యర్ధించారు.
జస్టిస్ రాజేశ్వర్ రావు స్పందిస్తూ, “ఇది వేలాదిమంది భవిష్యత్‌కి సంబంధించిన విషయం. కనుక తొందరపాటుతో తీర్పు చెప్పడం సరికాదు. సాక్ష్యాధారాలన్నీ క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే తీర్పు చెపుతాము,” అంటూ ఈ కేసు తదుపరి విచారణని జూన్ 11 కి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.
గ్రూప్-1 పరీక్షలలో అర్హత సాధించిన అభ్యర్ధుల సర్టిఫికెట్స్ పరిశీలనకు అనుమతిస్తూ గతంలో ఇచ్చిన ఉత్తర్వులను జూన్ 11 వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. కానీ తుది తీర్పు ప్రకటించే వరకు ఎవరికీ నియామక పత్రాలు జారీ చేయవద్దని ప్రభుత్వాన్ని ఆదేశించారు. కనుక గ్రూప్-1లో అర్హత సాధించిన అభ్యర్ధులకు అప్పటి వరకు టెన్షన్ భరించక తప్పదు.