తెలంగాణ ఇంటర్ పరీక్షా ఫలితాలు మంగళవారం వెలువడిన వెంటనే ఫెయిల్ అయిన విద్యార్ధుల కోసం అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ ప్రకటించింది ఇంటర్ బోర్డ్.
ఈ పరీక్షలకు హాజరయ్యే విద్యార్ధులు నేటి నుంచి ఈ నెల 30 వరకు దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. జూన్ 3 నుంచి 6 వరకు ఈ పరీక్షలు జరుగుతాయి. ఈ పరీక్షలకు సంబందించి విద్యార్ధులకు ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే helpdesk-ie-telangana.gov.in వెబ్ సైట్ ద్వారా సమాధానాలు పొందవచ్చు.
ఇంటర్ పరీక్షలలో ఫెయిల్ అయిన విద్యార్ధులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతుంటారు. కనుక వారి కోసం ఇంటర్ బోర్డ్ మానసిక నిపుణులతో కౌన్సిలింగ్ ఇప్పించి విద్యార్ధులకు సాయపడేందుకు కాల్ కౌన్సిలింగ్ హెల్ప్ లైన్ నంబర్: 14416 కూడా ఏర్పాటు చేసింది. కనుక ఫెయిల్ అయిన విద్యార్ధులు ఈ నంబరుకి ఫోన్ చేసి తమ బాధని చెప్పుకొని వారి సాయంతో మనో ధైర్యం పొందవచ్చు.
ఇంటర్ ఫెయిల్ అయిన లేదా పాస్ అయిన విద్యార్ధులు తమ మార్క్స్ రీ కౌంటింగ్‌కు రూ.100, మార్క్స్ షీట్స్ రీ-వెరిఫికేషన్ కోసం రూ.600 చెల్లించాల్సి ఉంటుంది.