ప్రపంచ బాధలను తన బాధలుగా భావించి కవితలు వ్రాసేవారు శ్రీశ్రీ. భాజపా రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్య స్వామి కూడా ఆవిధంగానే వ్యవహరిస్తుంటారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎక్కడ ఏమి జరిగినా దానిపై తక్షణం తన అభిప్రాయం ప్రకటించేసి దానిపై తీర్పు కూడా ఇచ్చేస్తుంటారు. 
గత వారం రోజుల నుంచి తమిళనాడు అధికార అన్నాడిఎంకెలో పన్నీర్ సెల్వం, శశికళ మద్య జరుగుతున్న ఆధిపత్య పోరులో ఆయన శశికళ పక్షాన్న నిలిచి తీర్పులు చెపుతున్నారు. తమిళనాడు ఇన్-ఛార్జ్ గవర్నర్ విద్యాసాగర్ రావు ఈ సమస్యను సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోతున్నారని రాష్ట్రపతిని కలిసి పిర్యాదు చేశారు. ఒకవేళ గవర్నర్ ఈ సమస్యను పరిష్కరించలేకపోతే తక్షణం తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. గవర్నర్ తీరు చూస్తుంటే పన్నీర్ సెల్వంకు అనుకూలంగా వ్యవహరిస్తునట్లుందని అన్నారు. పన్నీర్ సెల్వంకు గవర్నర్ మరొక 5 రోజులు సమయం ఇస్తే ఆయన అధికారం దక్కించుకొనేందుకు ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రయత్నించడం ఖాయమని సుబ్రహ్మణ్య స్వామి అన్నారు. శశికళకు ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి తగినంతమంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది కనుక గవర్నర్ విద్యాసాగర్ రావు తక్షణమే ఆమె చేత ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయించాలని సుబ్రహ్మణ్య స్వామి డిమాండ్ చేశారు.
తమిళనాడు అధికార పార్టీలో జరుగుతున్న ఈ సంక్షోభాన్ని భాజపా తనకు అనుకూలంగా మలుచుకొనేందుకు ప్రయత్నిస్తోందనేది బహిరంగ రహస్యమే. అందుకే గవర్నర్ విద్యాసాగర్ రావు ముంబై నుంచి చెన్నై చేరుకోవడానికి రెండు రోజులు సమయం తీసుకొన్నారనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది. కానే భాజపాకే చెందిన సుబ్రహ్మణ్య స్వామి తన పార్టీ ఆలోచనలకి పూర్తి భిన్నంగా మాట్లాడుతుండటం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది.