తెదేపా చేస్తున్నది సబబేనా?

February 09, 2017


img

తెలంగాణా తెదేపా అధ్యక్షుడు ఎల్ రమణ, వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి నేతృత్వంలో తెదేపా నేతలు డిల్లీ వెళ్ళి తెరాస సర్కార్ పై కేంద్రానికి పిర్యాదు చేశారు. కేంద్రప్రభుత్వం ఇచ్చిన నిధులని తెరాస సర్కార్ పక్కదారి పట్టిస్తోందని, కొన్ని పధకాలకు ఇచ్చిన నిధులను అసలు ఖర్చు చేయకుండా ఉంచేస్తోందని పిర్యాదు చేశారు. 

ఉదాహరణకు రైతులకు ఇన్-పుట్ సబ్సీడీ చెల్లింపు కోసం కేంద్రప్రభుత్వం రూ.791 కోట్లు మంజూరు చేసినప్పటికీ దానిని రైతులకు అందించకపోవడంతో ఆ నిధులు మిగిలిపోయాయని వారు ఆరోపించారు. కేంద్రప్రభుత్వం రైతుల కోసం ఇచ్చినప్పటికీ దానిని తెరాస సర్కార్ రైతులకు చెల్లించకపోవడం చేత రాష్ట్రంలో రైతులు తీవ్ర ఆర్ధికసమస్యలను ఎదుర్కొంటున్నారని తెదేపా నేతలు కేంద్రానికి పిర్యాదు చేశారు. ఒకవైపు చేతిలో ఉన్న నిధులను ఖర్చు పెట్టకుండానే మళ్ళీ కేంద్రాన్ని నిధుల కోసం డిమాండ్ చేస్తోందని పిర్యాదు చేశారు. వారు రైల్వే మంత్రి సురేష్ ప్రభుని కలిసి ఖాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని కోరారు. దానికోసం ఒక టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేయవలసిందిగా రైల్వే మంత్రి రైల్వేబోర్డు సభ్యుడు రవీంద్ర గుప్తాను ఆదేశించారు. 

ఇదివరకు ఒకసారి ఏపిలో జగన్మోహన్ రెడ్డి కూడా ఈవిధంగానే డిల్లీ వెళ్ళి ఏపి సర్కార్ పై కేంద్రానికి పిర్యాదులు చేశారు. అప్పుడు తెదేపా నేతలు, మంత్రులు ఆయన రాష్ట్రాభివృద్ధికి అడ్డుపడుతున్నారని తీవ్ర విమర్శలు చేశారు. తాము ఎంతో శ్రమపడి కేంద్రాన్ని ఒప్పించి రాష్ట్రానికి నిధులు, ప్రాజెక్టులు సాధించుకొని వస్తే, జగన్మోహన్ రెడ్డి డిల్లీ వెళ్ళి అవి మంజూరు కాకుండా అడ్డుపడుతున్నారని విమర్శించారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసిన పనే ఇప్పుడు తెలంగాణాలో తెదేపా నేతలు చేస్తుండటం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. 

పార్టీలు, వాటి ప్రయోజనాలు, రాజకీయ విభేదాలు ఎలాగ ఉన్నప్పటికీ అందరికీ రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం కావాలి. రాజకీయ శత్రుత్వం కారణంగా డిల్లీ వెళ్ళి ప్రభుత్వాల మీద పిర్యాదులు చేసుకొంటే రాష్ట్రానికి మంజూరు చేయవలసిన నిధులను కేంద్రప్రభుత్వం త్రొక్కిపెట్టే ప్రమాదం ఉంది. దాని వలన నష్టపోయేది రాష్ట్రమూ..ప్రజలే. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం నిధులను పక్కదారి పట్టిస్తున్నా లేదా ఖర్చు చేయకపోయినా తప్పనిసరిగా అది కేంద్రప్రభుత్వానికి ఆ లెక్కలు చెప్పుకోవలసి ఉంటుంది. ఇటువంటి ఆర్ధిక వ్యవహారాలను నిశితంగా పరిశీలించేందుకు కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలలో చాలా వ్యవస్థలు, తగిన ఏర్పాట్లు ఉన్నాయి. కనుక ప్రతిపక్ష పార్టీలు డిల్లీ వెళ్ళి రాష్ట్ర ప్రభుత్వంపై పిర్యాదులు చేయాలనే ఆలోచనలు ఎంత మాత్రం సమర్ధనీయం కాదు. 


Related Post