తెరాస, భాజపాల మద్య ఎటువంటి పొత్తులు లేకపోయినా నిన్నమొన్నటివరకు అవి జిగిరీ దోస్తుల్లానే వ్యవహరించాయి. కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ ముస్లిం రిజర్వేషన్ల బిల్లు గురించి మాట్లాడినప్పటి నుంచి తెరాసపై భాజపా కత్తులు దూయడం మొదలుపెట్టింది. మత ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇవ్వడాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తామని చెప్పడం ద్వారా తాము తెరాసకు ఎందుకు దూరం అయ్యమనే విషయం కూడా చాలా స్పష్టంగా చెప్పేసింది. కానీ ముస్లిం రిజర్వేషన్ల విషయంలో వెనకడుగు వేయకూడదని ముఖ్యమంత్రి కేసీఆర్ భావిస్తునందున, భాజపా పట్ల తెరాస నేతల వైఖరిలో కూడా మార్పు కనబడుతోంది.
తెరాస ఎంపిలు, ఎమ్మెల్యేలు కేంద్రప్రభుత్వంపై మూకుమ్మడి దాడులు చేయడమే అందుకు ప్రత్యక్ష నిదర్శనంగా చెప్పవచ్చు. తెరాస ఎంపిలు పార్లమెంటులో కేంద్రప్రభుత్వాన్ని గట్టిగానే నిలదీయడం సహజంగానే ఉంది. కానీ తెరాస ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్, ఎస్సీ కార్పోరేషన్ చైర్మన్ పిడమర్తి రవి వంటివారు కూడా కేంద్రంపై విమర్శలు గుప్పించడం కొంచెం అసహజంగా ఉంది. కానీ అదే తెరాస వైఖరిలో మార్పుకి అద్దం పడుతోంది.
విభజన చట్టంలో తెలంగాణా రాష్ట్రానికి ఎయిమ్స్, ఐఐఎం వంటి హామీల అమలులో కేంద్రప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోందని శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు. చివరికి గణతంత్ర దినోత్సవంనాడు తెలంగాణా శకటం ప్రదర్శనకు కూడా నోచుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గత రెండున్నరేళ్ళుగా అనేక సార్లు కేంద్రప్రభుత్వానికి రాష్ట్రం ఎదుర్కొంటున్న ఈ సమస్యలన్నిటి గురించి తెలంగాణా ప్రభుత్వం మోర పెట్టుకొంటున్నప్పటికీ అది తెలంగాణా పట్ల సవతితల్లి ప్రేమ చూపిస్తోందని శ్రీనివాస్ గౌడ్ అన్నారు.
గత రెండున్నరేళ్ళుగా ఈ సమస్యలున్నాయని శ్రీనివాస్ గౌడ్ చెపుతున్నారు. వాటి పరిష్కారం కోసం తెరాస సర్కార్, తెరాస ఎంపిలు అందరూ చాలా చిత్తశుద్ధిగా, నిశబ్దంగా ప్రయత్నాలు చేస్తునే ఉన్నారనేది ఎవరూ కాదనలేరు. కానీ కేంద్రంతో ఘర్షణపూరితమైన పరిస్థితులు ఎదురైనప్పుడు మాత్రమే వాటి గురించి తెరాస నేతలు సామాన్య ప్రజలకు కూడా వినబడేవిధంగా కొంచెం గట్టిగా మాట్లాడుతుంటారు. మళ్ళీ ఇప్పుడూ అదేవిధంగా మాట్లాడుతున్నారు. బహుశః భాజపాతో దూరం పెరగడమే అందుకు కారణంగా కనిపిస్తోంది. ముస్లిం రిజర్వేషన్ల బిల్లుపై వేడి చల్లారితే ఈ విమర్శల జోరు కూడా తగ్గే అవకాశం ఉంటుంది.