మొన్న నాగులు...నిన్న భాస్కర్...లాక్‌డౌన్‌ ఆత్మహత్యలు

September 12, 2020


img

లాక్‌డౌన్‌ సమయంలో దేశవ్యాప్తంగా లక్షలాదిమంది వలస కార్మికులు అష్టకష్టాలు పడటం అందరూ చూశారు. అయితే మీడియా దృష్టికి రానివారు లక్షల సంఖ్యలో ఉన్నారు. ప్రైవేట్ స్కూళ్ళు, కాలేజీలలో ఉపాధ్యాయులు, చిన్నాపెద్ద సంస్థలు, పరిశ్రమలు, దుకాణాలు, బేకరీలు, సినిమా థియేటర్స్, జిమ్ సెంటర్లు, హోటల్స్‌లో పనిచేసే చిరుద్యోగులు కూడా లాక్‌డౌన్‌ కారణంగా రోడ్డునపడ్డారు. లాక్‌డౌన్‌ క్రమంగా ఎత్తివేస్తున్నప్పటికీ కరోనా భయంతో వ్యాపారాలు సాగడంలేదు. కనుక నేటికీ చిరుద్యోగులు పని, ఆదాయం లేక దయనీయ జీవితాలు గడుపుతున్నారు. 

సినీ పరిశ్రమలో మళ్ళీ షూటింగ్స్ మొదలైనప్పటికీ సినిమా హాల్స్ ఇంకా తెరుచుకోనందున వాటిలో పనిచేస్తున్న ఉద్యోగుల పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. అన్‌లాక్‌-4లో సినిమా హాల్స్ తెరుచుకొనేందుకు కేంద్రప్రభుత్వం అనుమతిస్తుందని ఆశగా ఎదురుచూసిన వారికి తీవ్ర నిరాశే ఎదురైంది. దాంతో హైదరాబాద్‌లో ఐమాక్స్ థియేటర్‌లో ఆపరేటర్‌గా పనిచేస్తున్న భాస్కర్ (52) అనే వ్యక్తి నిన్న ఖైరతాబాద్‌లో తన నివాసంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకొన్నాడు. ఈ నెలవరకు సగం జీతం మాత్రమే ఇచ్చిన ఐమాక్స్ థియేటర్‌ యాజమాన్యం వచ్చే నెల నుంచి అది కూడా ఇవ్వలేమని చెప్పడంతో ఇప్పటికే అతికష్టం మీద కుటుంబాన్ని పోషించుకొంటున్న భాస్కర్ తీవ్రనిరాశనిస్పృహలకు లోనై నిన్న ఆత్మహత్య చేసుకొన్నాడు. పంజగుట్ట పోలీసులు కేసు నమోదు చేసుకొని భాస్కర్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. 

రెండు రోజుల క్రితం రంగారెడ్డి జిల్లా కడ్తల్‌కు చెందిన నార్లకంటి నాగులు (55) అనే వ్యక్తి హైదరాబాద్‌లో రవీంద్రభారతి వద్ద నడిరోడ్డుపై అందరూ చూస్తుండగా ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకొన్నాడు. ఆయన పంజాగుట్టలో ఓ ప్రైవేట్ కంపెనీలో గత ఆరేళ్లుగా వాచ్‌మ్యాన్‌గా పనిచేస్తుండేవాడు. లాక్‌డౌన్‌ కారణంగా అతనికి సగం జీతం మాత్రమే లభిస్తుండటంతో కుటుంబపోషణ భారమైంది. తెలంగాణ వచ్చినా మావంటివారి బ్రతుకులు మారలేదని ఆవేదన వ్యక్తం చేస్తూ గురువారం ఉదయం పెట్రోల్ పోసుకొని ఒంటికి నిప్పంటించుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. శాసనసభకు కూతవేటు దూరంలోనే ఆయన ఆత్మహత్యాయత్నం చేయడంతో ఈ ఘటన రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ దృష్టికి వచ్చింది. 63 శాతం కాలినగాయాలతో ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నాగులు పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని సమాచారం. 

ఈ ఆత్మహత్యలకు సదరు సంస్థలను కానీ ప్రభుత్వాలను గానీ తప్పు పట్టలేము. అయితే లాక్‌డౌన్‌ కారణంగా ఉద్యోగాలు కోల్పోయి ఆదాయం లేక దయనీయ జీవితాలు గడుపుతున్నవారికి ఓ దారి చూపించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదేనని చెప్పక తప్పదు. ఒకవేళ ప్రభుత్వాలు పట్టించుకోకపోతే లాక్‌డౌన్‌ బాధితుల ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉంటాయి. 


Related Post