చైనా ఉత్పత్తులపై నిషేదం... సాధ్యమేనా?

June 19, 2020


img

20 మంది భారత సైనికుల చావుకు కారణమైన చైనాపై ప్రతీకారం తీర్చుకోవాలని యావత్ భారతీయులు కోరుతున్నారు. అయితే చైనాతో ప్రత్యక్షయుద్ధం వలన భారత్‌ కూడా భారీగా మూల్యం చెల్లించవలసి వస్తుంది కనుక చైనాతో వాణిజ్య ఒప్పందాలను పునః సమీక్షించడం ద్వారా, చైనా వస్తువుల దిగుమతికి అడ్డుకట్ట వేయడం ద్వారా చైనాపై ప్రతీకారం తేర్చుకొనేందుకు భారత్‌ సిద్దమవుతోంది. భారత్‌కు ఎగుమతుల ద్వారా చైనా ఏటా వేలకోట్లు ఆదాయం పొందుతోంది. కనుక దానికి బ్రేక్ వేయగలిగితే చైనాకు పెద్ద దెబ్బే అవుతుందనే వేరే చెప్పక్కరలేదు.  

ఇప్పటికే ఆర్మీ, నావీ క్యాంటీన్లలో చైనా ఉత్పత్తులను ప్రభుత్వం నిషేదించింది. త్వరలో చైనాకు చెందిన 371 వస్తువుల  దిగుమతులపై కటినమైన ఆంక్షలు విధించబోతున్నట్లు కేంద్రమంత్రి రాంవిలాస్ పాశ్వాన్ తెలిపారు. గురువారం డిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, “చైనా సైనికులు మన 20 మంది జవాన్లను అతికిరాతకంగా హత్య చేశారు. దీనిపై దౌత్యపరంగా తీసుకోవలసిన చర్యలు ప్రభుత్వం ఇప్పటికే ప్రారంభించింది. త్వరలో చవుకబారు చైనా ఉత్పత్తుల దిగుమతిని అడ్డుకోవడానికి చర్యలు తీసుకోబోతున్నాము. భారతీయ ప్రమాణాల బ్యూరో (బిఐఎస్) నిర్దేశించిన ప్రమాణాలకు లోబడి లేని చైనా ఉత్పత్తులన్నిటినీ నిషేదించేందుకు చర్యలు తీసుకోబోతున్నాము. అలాగే చైనా ఉత్పత్తులపై కస్టమ్స్ సుంకాలు కూడా పెంచే ఆలోచన ఉంది. అయితే దేశ ప్రజలు కూడా ఇకపై చైనా ఉత్పత్తులను కొనకుండా బహిష్కరించాలని విజ్ఞప్తి చేస్తున్నాను,” అని అన్నారు.       

భారతీయ రైల్వే కూడా చైనాకు పెద్ద షాక్ ఇచ్చింది. కాన్పూర్‌లో దీన్‌దయాల్ రైల్వే కారిడార్‌లో రూ.471 కోట్ల వ్యయంతో 417కిమీ మేర సిగ్నలింగ్ వ్యవస్థ ఏర్పాటుకు 2016లో భారత రైల్వే డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (డీఎఫ్‌సీసీఐఎల్) బీజింగ్ నేషనల్ రైల్వే రీసెర్చ్ అండ్ డిజైన్ సంస్థతో ఒప్పందం చేసుకొంది. కానీ ఇంతవరకు దానిలో 20 శాతం పనులు కూడా పూర్తిచేయకపోవడంతో ఆ సంస్థతో చేసుకొన్న ఒప్పందాన్ని రద్దు చేస్తున్నట్లు డీఎఫ్‌సీసీఐఎల్ గురువారం ప్రకటించింది. 

చైనా ఉత్పత్తులకు భారత్‌ అడ్డుకట్టవేయగలిగితే చైనా ఏటా వేలకోట్లు నష్టపోతుంది. అదే సమయంలో భారత్‌లో ఆయా ఉత్పత్తులను తయారుచేసే సంస్థలకు మళ్ళీ జీవం పోసినట్లవుతుంది. త్వద్వారా వేలాదిమందికి ఉద్యోగాలు, ఉపాది అవకాశాలు లభిస్తాయి కూడా. అయితే భారత ప్రభుత్వం చైనా ఉత్పత్తులకు అడ్డుకట్టవేయగలదా?భారతీయ పరిశ్రమలు, వ్యాపార, వాణిజ్య సంస్థలు ఈ అవకాశాన్ని అనుకూలంగా మలుచుకొని మళ్ళీ పూర్వవైభవం సాధించగలవా?భారతీయులలో ఈ వేడి, ఆవేశం ఇంకా ఎంతకాలం నిలిచి ఉంటాయి?భారతీయులు చవుకగా దొరికే చైనా ఉత్పత్తులను కొనకుండా దేశీయ ఉత్పత్తులకు మొగ్గు చూపుతారా లేదా?అనే ప్రశ్నలకు రానున్న రోజులలో సమాధానాలు లభించవచ్చు.


Related Post