ప్రభుత్వాలు ఉచితంగా కరోనా పరీక్షలు, చికిత్సలు చేయించలేకపోతే...

June 15, 2020


img

నెలరోజుల క్రితం భారత్‌లో రోజుకు 3,000 పాజిటివ్ కేసులు నమోదవుతుండేవి. ఇప్పుడు రోజుకు 11,000 అవుతున్నాయి. గత 24 గంటలలో దేశంలో 11,502 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య 3,32,424కి చేరింది. 

అయితే కరోనా వైరస్ సోకినప్పటికీ కోలుకొంటున్నవారి సంఖ్య (50.59 శాతం) కూడా గణనీయంగా పెరగడం చాలా ఊరటనిచ్చే విషయం. కొలుకొంటున్నవారి సంఖ్య పెరగడంతో మరణాల సంఖ్య కూడా కాస్త తగ్గుముఖం పట్టిందని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ఏప్రిల్ 14న మరణాల శాతం 3.26 ఉండగా, జూన్ 14న అది 2.86 శాతానికి తగ్గింది.    

నేటి వరకు దేశవ్యాప్తంగా మొత్తం 1,69,798 మంది కోలుకొన్నారు. ప్రస్తుతం దేశంలో 1,52,106 మంది చికిత్స పొందుతున్నారు. అంటే వారిలో 50 శాతం మంది కోలుకొనే అవకాశాలున్నట్లు స్పష్టం అవుతోంది. 

కానీ రోజుకు 10-11,000 కొత్త కేసులు నమోదవుతుండటమే పెద్ద సమస్యగా మారింది. దాంతో ప్రభుత్వాసుపత్రులన్నీ నిండిపోతున్నాయి. కరోనా రోగులు పెరుగున్నకొద్దీ ప్రభుత్వాలు వారికి ఉచితంగా చికిత్స చేయించలేక చేతులెత్తేసే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇప్పటికే డిల్లీ, ముంబై, చెన్నై నగరాలలో ప్రభుత్వాసుపత్రులు కరోనా రోగులతో నిండిపోవడంతో ఏమి చేయాలో పాలుపోక ప్రైవేట్ ల్యాబ్‌లలో పరీక్షలకు, ప్రైవేట్ ఆసుపత్రులలో చికిత్సలకు అనుమతిస్తున్నాయి. తాజాగా తెలంగాణ రాష్ట్రం కూడా అదే చేయబోతోంది. ప్రైవేట్ ల్యాబ్‌లలో పరీక్షలకు, ప్రైవేట్ ఆసుపత్రులలో చికిత్సలకు మార్గదర్శకాలు, ధరలు నిర్ణయించవలసిందిగా సిఎం కేసీఆర్‌ వైద్యశాఖను ఆదేశించారు. 

కానీ దేశంలో కరోనా పరీక్షలు, చికిత్సలు చేయించుకొనే స్థోమత లేనివారు కోట్లమంది ఉన్నారు. ఒకవేళ ప్రభుత్వాలు వారికి ఉచితంగా పరీక్షలు, చికిత్సలు చేయించలేక చేతులు ఎత్తేస్తే వారి పరిస్థితి ఏమిటి?అని ఆలోచిస్తే చాలా భయానక దృశ్యాలు కళ్ళ ముందు కదలాడుతాయి. 

కనుక వారికి సైతం కరోనా వ్యాక్సిన్ అందుబాటులో వచ్చే వరకు వారందరికీ కరోనా సోకకుండా... అదే సమయంలో వారి జీవనోపాధి దెబ్బతినకుండా చేయవలసి ఉంటుంది. కానీ అది చాలా చాలా కష్టం. 130 కోట్లుకు పైగా ఉన్న భారత్‌ వంటి దేశంలో దాదాపు అసంభవం. కనుక కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు ఈ సమస్యపై లోతుగా ఆలోచించి పరిష్కారాలు కనుగొంటాయని ఆశించడం తప్ప ఏమీ చేయలేము.


Related Post