ఇంకా ఎంతకాలం ఈ భ్రమలు?

June 11, 2020


img

ఒకవైపు కరోనా భూతం ప్రజల వెంటపడి ప్రాణాలు తీస్తుంటే కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం “మరేం పరువాలేదు.. ఆందోళన చెందకండి...పరిస్థితులు పూర్తిగా అదుపులోనే ఉన్నాయి...కరోనాను ఎదుర్కోవడానికి అన్ని ఏర్పాట్లు చేశాము...” అంటూ సర్దిచెప్పేందుకు ప్రయత్నిస్తుండటం విస్మయం కలిగిస్తోంది. 

దేశంలో నానాటికీ పాజిటివ్ కేసులు పెరిగిపోతుంటే, “విదేశాలతో పోలిస్తే మన దేశంలో కరోనా వ్యాప్తి చాలా మెల్లగా జరుగుతోంది. నమ్మండి... మన దేశంలో కరోనా వైరస్ ఇంకా సామాజిక వ్యాప్తి దశకు చేరుకోలేదు,” అని సర్ది చెపుతున్నాయి. 

కరోనా రోగులతో ఆసుపత్రులు కిటకిటలాడుతున్నాయంటే..“అదేం లేదు... ఇంకా ఎంతమంది రోగులు వచ్చిన చికిత్స చేసేందుకు సరిపడినంతమంది వైద్యులు, సిబ్బంది, పడకలు, ఏర్పాట్లు ఉన్నాయని” చెపుతున్నాయి. మరో పక్క ఇళ్లలోనే చికిత్స చేయిస్తామంటూ కరోనా రోగులను ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ చేసి పంపించేస్తున్నాయి. “రెండున్నర నెలలుగా కరోనా రోగులకు చికిత్స చేసి చేసి అలసిపోయామని, ఇంకా ఎంతకాలం మాపై ఈ భారం వేస్తారంటూ” సికింద్రాబాద్‌ గాంధీ ఆసుపత్రిలోని జూనియర్ డాక్టర్లు ప్రశ్నిస్తున్నారంటే వాస్తవ పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. 1,500 పడకల సామర్ధ్యం కలిగిన ఆసుపత్రులలో కేవలం 2-300 మంది మాత్రమే రోగులు ఉండటం నిజమైతే మరి జూనియర్ డాక్టర్లు ఎందుకు ఆందోళన చేస్తున్నట్లు? 

తగినన్ని కరోనా పరీక్షలు ఎందుకు జరుపడం లేదని కోర్టులు ప్రశ్నిస్తుంటే ప్రభుత్వాలకు కోపం వచ్చేస్తోంది! ప్రభుత్వాన్ని అప్రదిష్టపాలు చేయడానికే కొందరు కోర్టులలో ప్రజాహితవాజ్యాలు వేస్తున్నారని వాదిస్తున్నాయి. ప్రతిపక్షాలో లేదా ప్రభుత్వం అంటే గిట్టనివారో కోర్టులో పిటిషన్లు వేస్తే వాటిలో నిజానిజాలను గ్రహించగల శక్తి కోర్టులకు ఉంటుంది కదా? కానీ కోర్టులు కూడా ఎందుకు ప్రభుత్వాలను ప్రశ్నిస్తున్నాయి?వాటికి ప్రభుత్వంపై బురద జల్లవలసిన అవసరం లేదు కదా? అని ఆలోచిస్తే ప్రభుత్వ వాదనలలో డొల్లతనం అర్ధమవుతుంది. 

ఇక నగరాలు, పట్టణాలు, పల్లెలో ఎక్కడ కరోనా తీవ్రత ఎక్కువుంది? ఎక్కడెక్కడ కంటెయిన్మెంట్ జోన్‌లు ఉన్నాయి? అనే విషయం కూడా ఇప్పుడు ప్రభుత్వాలు దాచి పెడుతున్నాయంటే కరోనా తీవ్రత పెరిగిందనుకోవాలా లేక ఎక్కడా కరోనా లేదనుకోవాలా?   

ఒకప్పుడు అన్ని రాష్ట్రాలు జిల్లాలువారీగా రోజూ ఎన్ని కేసులు నమోదయ్యాయి. ఎంతమంది కోలుకొన్నారు?ఎంతమంది చికిత్స పొందుతున్నారు. ఎంతమంది మరణించారు? వంటి వివరాలను ప్రకటించేవి. కానీ ఇప్పుడు అంతా రహస్యమే. దాదాపు అన్ని రాష్ట్రాలు చాలా క్లుప్తంగా గణాంకాలు ప్రకటిస్తున్నాయి. 

కరోనా మరణాలు పెరిగిపోతున్నాయంటే, ఇతరదేశాలతో పోలిస్తే భారత్‌లో కరోనా మరణాలు చాలా తక్కువని కనుక ఆందోళన చెందవద్దని కేంద్రం గణాంకాలు చెపుతోంది. తమిళనాడులో ప్రైవేట్ ఆసుపత్రులలో మరణించిన కరోనా రోగులను ప్రభుత్వ జాబితాలో చేర్చలేదనే దుమారం రేగడం గమనిస్తే, ప్రభుత్వాలు ప్రకటిస్తున్న గణాంకాలలో పారదర్శకత లోపించిందనే అనుమానం కలగడం సహజం. 

ఒకపక్క కార్చిచ్చులా కరోనా వైరస్ దేశమంతటా వ్యాపిస్తున్నా...కరోనా వైరస్ వలన జరుగుతున్న, జరుగబోయే నష్టం, తీవ్ర పరిణామాలు కళ్ళకు కట్టినట్లు స్పష్టంగా కనబడుతున్నా “ఏం కాదు...అంతా నియంత్రణలోనే ఉందంటూ” గణాంకాలతో ప్రజలను నమ్మించాలనుకోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. 

ఈవిధంగా కరోనాను దాచిపెట్టి ప్రజలను భ్రమలో ఉంచితే జరుగబోయే నష్టం నిలిచిపోతుందా కనీసం తగ్గుతుందా? అంటే కాదనే చెప్పవచ్చు. కరోనా నివారణకు వ్యాక్సిన్ వచ్చేవరకు అంటే కనీసం మరో 6-12 నెలలపాటు కరోనా వ్యాపిస్తూనే ఉంటుంది. నిర్లక్ష్యంగా ఉన్నవారు, రెక్కాడితే కానీ డొక్కాడనివారు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారు మరణిస్తూనే ఉంటారు. ఇది చేదు నిజం. 

కరోనా కారణంగా విద్యార్ధులు పరీక్షలకు, పాఠశాలలకు వెళ్ళలేని దుస్థితి. ధైర్యంగా బయటకు వెళ్ళి పనులుచేసుకోలేని దుస్థితి ఏర్పడింది. దీంతో అనేకమంది నిరుద్యోగులుగా మారనున్నారు. ఆ కారణంగా ఆర్ధిక, సామాజిక, మానసిక, కుటుంబ సమస్యలు తలెత్తే ప్రమాదం కనిపిస్తోంది. ఇన్ని సమస్యలు కళ్ళకు స్పష్టంగా కనిపిస్తుంటే ప్రభుత్వాలు ప్రజలకు వాస్తవాలు తెలియజేసి, ఈ సమస్యలను ఎదుర్కొనేందుకు మానసికంగా సిద్దం చేయకుండా ఇంకా భ్రమలో ఉంచాలనుకోవడం విస్మయం కలిగిస్తుంది. 

కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలలో ఎందరో మేధావులు, ఐఏఎస్ అధికారులున్నారు. కానీ లాక్‌డౌన్‌ ప్రకటించేముందు ఎటువంటి ముందస్తు ఏర్పాట్లు చేయాలో ఎవరూ చెప్పలేకపోయారు! లక్షలాదిమంది వలస కార్మికులు రోడ్లపైకి వస్తే తప్ప వారి సమస్యలను ముందుగా అంచనా వేయలేకపోయారు! ఇప్పుడు దేశంలో కరోనా కార్చిచ్చులా వ్యాపిస్తున్నా రానున్న రోజులలో ఎదురయ్యే ఈ సమస్యలన్నిటినీ ఏవిధంగా అధిగమించాలో ఆలోచించలేకపోతున్నారు. అంటే వారికి సామాన్యులకు మించి ఆలోచన, దూరదృష్టి లేవనుకోవాలా లేక వారి సూచనలను, సలహాలను ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదనుకోవాలా?

 ఏది ఏమైనప్పటికీ కరోనా రాకమునుపు...వచ్చిన తరువాత కూడా దానిని సమర్ధంగా ఎదుర్కోవడంలో ప్రభుత్వాలు వైఫల్యం చెందినట్లే కనిపిస్తున్నాయి. ఈ వాదన నిజమో కాదో రానున్న 3-4 నెలల్లో తేలిపోతుంది. కనుక ఇప్పటికైనా కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు తమ రాజకీయ ప్రయోజనాలు, ఓట్ల లెక్కలు అన్నీ పక్కన పెట్టి, కరోనాతో ముడిపడున్న ఈ సమస్యలను వాస్తవదృష్టితో చూసి పరిష్కరించేందుకు నిజాయితీగా ప్రయత్నించాలి లేకుంటే భారత్‌ భవిష్యత్‌, కోట్లాదిమంది నిరుపేదల జీవితాలు ఆగమ్యగోచరంగా మారే ప్రమాదం ఉంటుంది. 


Related Post