కెసిఆర్ జీ ప్లీజ్ హెల్ప్: కుమారస్వామి

May 17, 2018


img

కర్ణాటకలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు కోసం కెసిఆర్ చేస్తున్న ప్రయత్నాలకు అనుకూలంగా మారడం విశేషం. కొన్ని రోజుల క్రితమే సిఎం కెసిఆర్ బెంగళూరు వెళ్ళి ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు గురించి జెడిఎస్ అధినేతలు దేవగౌడ, కుమారస్వామిలతో చర్చించి, ఎన్నికలలో వారి పార్టీకి మద్దతు కూడా ప్రకటించారు. అయితే తాను ఏ కాంగ్రెస్ పార్టీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారో అదే కాంగ్రెస్ పార్టీతో జెడిఎస్ జతకట్టడంతో అది ఫెడరల్ ఫ్రంట్ ఆశయానికి విరుద్దం కనుక సిఎం కెసిఆర్ కు ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడింది. కానీ నేడు ఎడ్యూరప్ప కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడంతో జెడిఎస్ అధినేత కుమారస్వామి ఆలోచనలో కూడా మార్పువచ్చినట్లుంది. 

నిన్నటి వరకు తనే ముఖ్యమంత్రి అవుతానని తీయటి కలలు కన్న ఆయనకు భాజపా మాయోపాయంతో అధికారం దక్కించుకోవడంతో తీవ్ర ఆగ్రహం చెందారు. తన కలలను భగ్నం చేసిన కేంద్రప్రభుత్వంపై యుద్దప్రకటన చేశారు. తన అధికార బలంతో ప్రాంతీయపార్టీలను రాజకీయంగా దెబ్బతీస్తున్న కేంద్రప్రభుత్వంపై పోరాటానికి దేశంలో ప్రాంతీయ పార్టీలన్నీ ఏకం కావాలని, ఏపి, తెలంగాణా, ఓడిశా ముఖ్యమంత్రులు చంద్రబాబు, కెసిఆర్, నవీన్ పట్నాయక్, బి.ఎస్.పి అధినేత మాయావతి తదితరులు అందరూ ఈ పోరాటంలో తమతో కలిసిరావాలని కుమారస్వామి పేరుపేరునా విజ్ఞప్తి చేశారు. 

ఇంతకాలం కెసిఆర్ ఒక్కరే పనిగట్టుకొని ఒక్కో రాష్ట్రానికి వెళ్ళి అక్కడి నేతలకు ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేయవలసిన అవసరం గురించి వివరించి, వారిని దానిలో చేర్పించడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ కాగల కార్యం గంధర్వులే పూర్తి చేశారన్నట్లు కర్ణాటకలో రాజకీయపరిణామాలు దేశంలో ప్రాంతీయ పార్టీలకు కనువిప్పు కలిగించి ఫెడరల్ ఫ్రంట్ కు అనుకూల పరిస్థితులు కల్పించాయి. 

అయితే నేటికీ ఫెడరల్ ఫ్రంట్ లో భాగస్వాములు కాబోయే పార్టీలు కాంగ్రెస్, భాజపాలకు సమానదూరం పాటించడానికి సిద్దపడతాయా లేదా అనేదానిపైనే ఫెడరల్ ఫ్రంట్ భవిష్యత్ ఆధారపడి ఉంటుందని చెప్పవచ్చు. ఇతర రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలు కూడా జెడిఎస్ లాగ అధికారం కోసం కాంగ్రెస్, భాజపాలలో ఏదో ఒక పార్టీతో జత కట్టడానికి సిద్దపడే అవకాశాలే ఎక్కువ. అవకాశవాద రాజకీయ పార్టీలు, నేతలతో ఏర్పాటు చేసే ఫెడరల్ ఫ్రంట్ తో జాతీయ రాజకీయాలలో గుణాత్మకమైన మార్పు సాధించడం సంగతి దేవుడెరుగు కనీసం ప్రజల నమ్మకాన్ని పొందడం కూడా కష్టమే కావచ్చు. కనుక కాంగ్రెస్, భాజపాలకు దూరంగా ఉండదలచిన పార్టీలతోనే ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేసుకోవడం మంచిది. లేకుంటే కర్ణాటకలో ఎదురైనా అనుభవమే మళ్ళీ ఎదురయ్యే అవకాశం ఉంటుంది. అప్పుడు ‘ఆపరేషన్ సక్సస్ కానీ పేషంట్ డెడ్’ అన్నట్లు కెసిఆర్ శ్రమంతా బూడిదలో పూసిన పన్నీరుకావచ్చు. 


Related Post