ఒకేసారి ఎన్నికలు సాధ్యమేనా?

May 09, 2018


img

దేశవ్యాప్తంగా ఒకేసారి శాసనసభ, లోక్ సభ ఎన్నికలు నిర్వహించాలని మోడీ సర్కార్ చాలా రోజులుగా ఆలోచిస్తోంది. అయితే అది అంత తేలికైన విషయం కాదని అందరికీ తెలుసు. 

దేశవ్యాప్తంగా ఒకేసారి లోక్ సభ ఎన్నికలు జరుగుతున్నప్పటికీ, వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు మాత్రం వేర్వేరు సమయాలలో జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణావంటి కొన్ని రాష్ట్రాలలో మాత్రమే ఏకకాలంలో శాసనసభ, లోక్ సభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఉదాహరణకు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు ఈనెల 12వ తేదీన జరుగుతున్నాయి. కానీ లోక్ సభ ఎన్నికలు 2019లో జరుగుతాయి.

శాసనసభ, లోక్ సభ ఎన్నికలను ఒకేసారి కలిపి నిర్వహించినట్లయితే, కేంద్రంపై ఎన్నికల నిర్వహణ భారం చాలా తగ్గుతుంది. పైగా మళ్ళీ ఐదేళ్ళవరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల గురించి ఆలోచించనవసరం లేదు కనుక పాలన, అభివృద్ధిపై దృష్టి కేంద్రీకరించడానికి ఎక్కువ సమయం లభిస్తుంది. కనుక శాసనసభ, లోక్ సభలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని కేంద్రప్రభుత్వం భావిస్తోంది. కానీ ఆవిధంగా చేయాలంటే కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు పదవీకాలం ముగియక ముందే రద్దు చేయవలసి ఉంటుంది.  కనుక ఈ ప్రతిపాదనకు అన్ని రాష్ట్రాలు అంగీకారం కూడా తప్పనిసరి.

సంక్లిష్టమైన ఈ ప్రతిపాదనపై చర్చించేందుకు కేంద్ర ఎన్నికల కమీషన్, కేంద్ర న్యాయ కమీషన్ ఈ నెల 16వ తేదీన డిల్లీలో సమావేశం కాబోతున్నాయి. ఇప్పటికే ఆ రెండు సంస్థల అధికారులు, నిపుణులు ఈ ప్రతిపాదనను అమలుచేయడానికి కొన్ని మార్గాలు కనుగొన్నారు. రాజ్యాంగంలో రెండు సవరణలు చేసినట్లయితే, జమిలి ఎన్నికల నిర్వహణకు వీలుపడుతుందని న్యాయకమీషన్ అధికారులు భావిస్తున్నారు.

ఇటీవల కాలంలో ఎన్నికలు జరిగిన రాష్ట్రాలలో ప్రభుత్వాలను రద్దు చేసి మళ్ళీ ఎన్నికలు నిర్వహించడం అసాధ్యం కనుక, వాటి పదవీకాలాన్ని మళ్ళీ జమిలి ఎన్నికలు నిర్వహించే సమయానికి కుదించవలసి ఉంటుందని న్యాయనిపుణులు అభిప్రాయపడుతున్నారు. మే 16వ తేదీన జరుగబోయే సమావేశంలో ఈ ప్రతిపాదనపై లోతుగా చర్చించిన తరువాత కానీ దీనిపై స్పష్టత రాదు.

కానీ రాష్ట్రాల సహకారం, అంగీకారం లేకుండా ఈ ప్రతిపాదనను అమలుచేయడం కష్టమేనని చెప్పవచ్చు. ముఖ్యంగా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు ఈ ప్రతిపాదనను తిరస్కరించవచ్చు లేదా అభ్యంతరాలు వ్యక్తం చేయవచ్చు. కనుక జి.ఎస్.టి.ని అమలులోకి తీసుకురావడానికి కేంద్రం ఎంత కృషి చేసిందో, దీనికోసం అంతకంటే ఎక్కువే కృషి చేయాల్సి ఉంటుంది.


Related Post