చైనా విడిపోయింది

May 04, 2018


img

అవును.. చైనా విడిపోయింది. అంటే చైనా దేశం కాదు. శ్రీ చైతన్య, నారాయణ కాలేజీలు. ఆ రెండు కాలేజీలు చేతులు కలిపి ‘చైనా’ బ్యాచ్ (చైతన్య, నారాయణ)లను ఏర్పాటు చేసుకొన్న సంగతి అందరికీ తెలిసిందే. అవిప్పుడు విడిపోయాయి. 

ఇటీవల విడుదలైన ఎంసెట్, ఇంటర్‌, జేఈఈ ఫలితాలలో శ్రీచైతన్యలో చదువుకొని ర్యాంకులు సాధించిన విద్యార్ధులను నారాయణ సంస్థ తన విద్యార్ధులుగా ప్రకటించుకొంటోందని, శ్రీచైతన్య విద్యాసంస్థల అధినేత బివి రావు ఆరోపించారు. అయన ఈరోజు మీడియాతో మాట్లాడుతూ, “ఏపి ఎంసెట్ లో మా సంస్థలలో చదివిన విద్యార్ధులకు టాప్ ర్యాంకులు సాధిస్తే నారాయణ సంస్థ వారిని తమ విద్యార్ధులుగా చాటుకొంటోంది. అలాగే జెఈఈలో మా విద్యార్ధులు టాప్ 5 ర్యాంకులు సాధిస్తే, నారాయణ సంస్థ విద్యార్ధులే ఆ ర్యాంకులు సాధించారని తప్పుడు ప్రకటనలు ఇస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తోంది. మా విద్యాసంస్థలలో చదువుకొన్న విద్యార్ధులు సాధించిన ర్యాంకులను నారాయణ సంస్థ తనవిగా ప్రచారం చేసుకోవడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. అవసరమైతే దీనిపై మేము న్యాయపోరాటానికి కూడా వెనుకాడబోమని హెచ్చరిస్తున్నాను. ఇక నుంచి నారాయణ సంస్థలతో మేము ఎటువంటి సబంధాలు కొనసాగించదలచలేదు. కనుక ఎవరైనా ‘చైనా బ్యాచ్’లు కొనసాగుతున్నాయని చెపితే నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాము,” అని అన్నారు. 

ఒకప్పుడు చిన్న చిన్న ఊళ్ళలో..పట్టణాలలో..నగరాలలో చిన్నచిన్న ప్రైవేట్ పాఠశాలలు, కాలేజీలు ఉండేవి. వాటి ఫీజులు సామాన్యులకు సైతం అందుబాటులో ఉండేవి. ఆ కారణంగా వాటిలో చదువుకునే అవకాశం ఉండేది. కానీ చైతన్య, నారాయణ, తదితర కార్పోరేట్ విద్యా సంస్థలు విద్యారంగంలో ప్రవేశించిన తరువాత ఆ చిన్న చిన్న కాలేజీలు మెల్లగా మాయం కాసాగాయి. కారణాలు అందరికీ తెలిసినవే. విద్యారంగంలో కార్పోరేట్ సంస్థలు ప్రవేశించి విద్యనూ వ్యాపారస్థాయికి దిగజార్చేశాయి. ఒక వ్యాపారి లాభాలు ఆర్జించడం కోసం ఎన్ని రకాలుగా ప్రయత్నిస్తాడో, ఈ కార్పోరేట్ విద్యాసంస్థలు అంతకంటే ఎక్కువ ఎత్తులే వేస్తూ తమ విద్యావ్యాపార సామ్రాజ్యాలను రెండు తెలుగు రాష్ట్రాలలో నలుమూలలకు విస్తరించాయి. ఒకప్పుడు ఏ ఊరిలో చూసినా చిన్నచిన్న పాఠశాలలు, జూనియర్, డిగ్రీ కాలేజీలు కనిపించేవి. ఇప్పుడు వాటి స్థానంలో శ్రీ చైతన్య, నారాయణ మరో రెండు మూడు పెద్ద విద్యాసంస్థలు మాత్రమే కనిపిస్తున్నాయి. విద్యావ్యాపారంలో ఉన్న రాబడి, లాభాలు మరే రంగంలో లేవనేందుకు అవే చక్కటి ఉదాహరణలు.

ఈ విద్యావ్యాపారంలో ఇంతవరకు చేతులు కలిపి సాగిన ఆ రెండు సంస్థల మద్య కూడా ఇప్పుడు పోటీ ఏర్పడినందునే ఇటువంటి యుద్ధాలు మొదలయ్యాయని అర్ధం అవుతోంది. విద్యావ్యవస్థను ఒక వ్యాపారంగా మార్చేయడం కాకుండా, ర్యాంకుల విషయంలో తప్పుడు ప్రకటనలు చేసుకొంటూ విద్యావ్యవస్థలో ఒక అనారోగ్యకరమైన వాతావరణం సృష్టించడం చాలా శోచనీయం.


Related Post