ఇక వారికి ఉరి శిక్షే కానీ...

April 21, 2018


img

గత రెండు మూడు వారాలుగా అభంశుభం తెలియని బాలికలపై వరుసగా జరుగుతున్న హేయమైన ఘటనలపై దేశవ్యాప్తంగా ప్రజలు, మీడియా, ప్రతిపక్షాలు పెద్దఎత్తున నిరసనలు తెలియజేస్తుండటంతో కేంద్రప్రభుత్వం మేల్కొంది. 

ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన శనివారం డిల్లీలో కేంద్రమంత్రివర్గ సమావేశం జరిగింది. దానిలో కీలక నిర్ణయం తీసుకొన్నారు. 12 ఏళ్ళులోపు పిల్లలపై అత్యాచారాలకు పాల్పడేవారికి మరణశిక్ష విధించాలనే ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీనిపై ఒక ఆర్డినెన్స్ రూపొందించి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆమోదానికి పంపిస్తారు. అయన సంతకం చేయగానే ఆర్డినెన్స్ అమలులోకి వస్తుంది. 

ఇటువంటి హేయమైన నేరాలు చేసేవారికి అంత కటినమైన శిక్షలు విధించినప్పుడే, మళ్ళీ ఇటువంటి నేరాలు చేయడానికి ఎవరూ సాహసించకుండా ఉంటారు. కానీ మనదేశంలో 5 ఏళ్ళ క్రితం నిర్భయ చట్టం అమలులోకి వచ్చినప్పటికీ, నేటికీ మహిళలు, ఇప్పుడు చిన్నారులపై కూడా అత్యాచారాలు, హత్యలు, లైంగిక వేధింపులు, యాసిడ్ దాడులు జరుగుతూనే ఉన్నాయి. అందుకు కారణం నిర్భయ చట్టం అమలులో జాప్యమే. 

డిసెంబర్ 16, 2012లో దేశరాజధాని డిల్లీలో నిర్భయపై అత్యాచారం జరిగితే, నేటికీ ఆ చట్టాలలోని లొసుగులను ఉపయోగించుకొంటూ దోషులు అందరూ జైల్లో కులాసాగా గడుపుతున్నారు. వారు సామూహిక అత్యాచారం చేశారని సుప్రీంకోర్టు దృవీకరించి శిక్షలు వేసినా వాటిని అమలుచేయలేకపోతున్నారు. అందుకే ఎంత కటినమైన చట్టాలు తెచ్చినప్పటికీ ఇటువంటి మృగాలు భయపడటం లేదు. 

కనుక చట్టాలు చేసి చేతులు దులుపుకోకుండా వాటిని అంతే వేగంగా అమలుచేసి దోషులకు శిక్షలుపడేలా చేయగలిగినప్పుడే ఇటువంటి హేయమైన నేరాలు తగ్గే అవకాశం ఉంటుంది. 


Related Post