సోషల్ మీడియా చేతిలో దేశభవిష్యత్?

March 26, 2018


img

ఐటి రంగం ఆవిర్భవించినప్పటి నుంచి అది నానాటికీ శాఖోపశాఖలుగా విస్తరిస్తూనే ఉంది. అనేక కోట్లమందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తోంది. ఐటిలో ఒక్కో రంగానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. వాటిలో డేటా అనలటిక్స్ కూడా ఒకటి. నిన్నమొన్నటి వరకు డేటా అనలటిక్స్ అంటే చాలా మేధస్సు, ఉన్నత నైపుణ్యం కలవారు మాత్రమే చేయగలిగే ఉద్యోగమని భావించేవారు. ఆ కారణంగా ఐటిలో మిగిలిన శాఖలతో పోలిస్తే డేటా అనలటిక్స్ కు ఒక ప్రత్యేక స్థానం ఏర్పడింది. 

అయితే దానిని రాజకీయ పార్టీలు తమ అవసరాల (ప్రయోజనాల) కోసం కూడా వినియోగించుకోవడం మొదలుపెట్టినప్పటి నుంచి దానిలో ‘అనైతిక గుణం’ జొరబడింది. డేటా అనలటిక్స్ సాయంతో ప్రజల అవసరాలు, సమస్యలు, వారి వ్యక్తిగత అలవాట్లు వంటి ప్రతీ అంశం గురించి సమగ్ర సమాచారం సేకరించి, విశ్లేషించి, వచ్చిన సమాచారం ఆధారంగా రాజకీయ పార్టీలు ఓటర్లను ఆకట్టుకొనేవిధంగా ఎన్నికల వ్యూహాలు రూపొందించుకొని విజయాలు సాధించడం మొదలుపెట్టాయి. 

డేటా అనలటిక్స్ లో అనైతికత ఏ స్థాయికి చేరిందంటే, రాజకీయ పార్టీల ప్రయోజనాల కోసం అబద్ధాలు ప్రచారం చేయడం, ఉన్నవి లేనట్లుగా లేనివి ఉన్నట్లుగా ప్రచారం చేయడం, సోషల్ మీడియాను ఉపయోగించుకొని ప్రత్యర్ధులపై కల్పిత కధనాలు ప్రచారం చేసి రాజకీయంగా దెబ్బ కొట్టడం వరకు వెళ్లిపోయింది. రాజకీయాలలో ఏవిధంగా విలువలు పతనం అవుతున్నాయో అదేవిధంగా అత్యంత శక్తివంతమైన డేటా అనలటిక్స్ కూడా అవినీతి రొంపిలో మునిగిపోతోంది. అందుకే ఇప్పుడే డేటా అనలటిక్స్ అంటే అదేదో బూతుపదం అన్నట్లుగా మారింది. 

భారత్ తో సహా దేశవిదేశాలలో రాజకీయపార్టీలు దానిని అనైతిక పద్దతులలో ఉపయోగించుకొని లబ్ది పొందాయని పరస్పర ఆరోపణలు చేసుకొంటున్నాయి. తెర వెనుక పనిచేసుకుపోయే డేటా అనలటిక్స్ ఇప్పుడు ఒక దేశ (రాజకీయ) భవిష్యత్ ను నిర్దేశించే స్థాయికి చేరుకొందంటే అతిశయోక్తి కాదు. 

అమెరికా అధ్యక్ష ఎన్నికలలో 5 కోట్లమంది ‘ఫేస్ బుక్’ వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని కేంబ్రిడ్జ్ అనలిటికాకు అందజేసిందనే రహస్యం బట్టబయలు అవడంతో ఫేస్ బుక్ వ్యవస్థాపకుడు జూకర్ బర్గ్ నేరం జరిగినట్లు అంగీకరించడమే కాకుండా ప్రజలకు క్షమాపణలు చెప్పుకొన్నారు. ఇకపై అటువంటి తప్పు చేయమని హామీ ఇచ్చారు. 

మరొక ఏడాదిలో భారత్ లో కూడ సార్వత్రిక ఎన్నికలు జరుగబోతున్న ఈ సమయంలో ఈ ‘డేటా అనలటిక్స్ భాగోతాలు’ బయటపడటంతో భారత ప్రభుత్వం కూడా అప్రమత్తం అయ్యింది. భారత్ లో కూడా ఫేస్ బుక్ సంస్థ ఆవిధంగా ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని వారి అనుమతి పొందకుండా ఏ సంస్థకైనా అందించిందా?అందిస్తే దాని ద్వారా అంతిమంగా ఎవరు లబ్ది పొందబోతున్నారు? వగైరా వివరాలను తెలుపవలసిందిగా కోరుతూ ఫేస్ బుక్ సంస్థకు  నోటీసులు పంపించింది. మార్చి 31వ తేదీలోగా పూర్తి వివరాలతో సమాధానం ఇవ్వాలని లేకుంటే చట్ట ప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించింది. కేంద్రం ఎన్నికల కమీషన్ కూడా ఫేస్ బుక్ సంస్థకు వేరేగా నోటీసులు పంపించినట్లు సమాచారం.


Related Post