‘మీ ప్రయాణం సుఖవంతం అవుగాక..’ అని రైల్వేశాఖ పదేపదే చెపుతున్నప్పటికీ నేటికీ టికెట్ రిజర్వేషన్ మొదలు రైలు ప్రయాణం వరకు అడుగడుగునా ప్రయాణికులకు ఇబ్బందులు తప్పడం లేదు. రైల్వే స్టేషన్‌కి వెళ్ళి కౌంటర్ దగ్గర టికెట్ రిజర్వేషన్ చేసుకోవాలన్నా కష్టమే, ఆన్‌లైన్‌లో ఐఆర్‌సీటిసీ వెబ్ సైట్ ద్వారా టికెట్ కొనుగోలు చేయాలన్నా నరకమే. ఇక రైలు ప్రయాణంలో ఇబ్బందులకు అంతే ఉండదు.
అయితే గతంతో పోలిస్తే రైల్వేశాఖ ఎప్పటికప్పుడు వీటన్నిటినిపై దృష్టి పెట్టి సరిచేస్తూనే ఉంది. అటువంటి మరో ప్రయత్నమే ‘రైల్ వన్’ మొబైల్ యాప్.
రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్ ‘రైల్ వన్’ యాప్‌ని నిన్న ఢిల్లీలో ఆవిష్కరించారు. రైల్వేకి సంబందించి అన్ని సేవలు, వివరాలు దీనిలో అందుబాటులో ఉంటాయి.
ఐఆర్‌సీటిసీ వెబ్ సైట్‌లో కొన్ని సేవలు మాత్రమే అందుబాటులో ఉంటాయి. కానీ దీనిలో టికెట్ రిజర్వేషన్, జనరల్ టికెట్, ప్లాట్ ఫారం టికెట్ బుకింగ్, పిఎన్ఆర్ స్టేటస్, బుకింగ్ రద్దు, ట్రైన్ రన్నింగ్ స్టేటస్, రైల్లో పోలీసులు లేదా వైద్య సహాయం, ఫుడ్ ఆర్డర్ వంటి అనేక ఫీచర్స్ దీనిలో ఉన్నాయి.
అలాగే దీని ద్వారా ప్రయాణికులు తమ అభిప్రాయాలు, సూచనలు, బుకింగ్, ప్రయాణంలో ఎదుర్కొన్న సమస్యలు వంటివి రైల్వేశాఖకి తెలియజేయవచ్చు. ‘రైల్ వన్’ మొబైల్ యాప్‌ని గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.