బస్ పాస్ ఛార్జీలు పెంచాం స్వాగతించండి: టిజిఎస్ ఆర్టీసీ

June 10, 2025
img

అవును! టిజిఎస్ ఆర్టీసీ విద్యార్ధుల బస్ పాస్ ఛార్జీలు పెంచి స్వాగతించమని కోరింది. ప్రస్తుతం నెలకు కనిష్ట ఛార్జీ 4 కిమీలకు రూ.150 ఉండగా దానిని ఒకేసారి రూ.225కి పెంచింది. హైదరాబాద్‌, వరంగల్‌లో విద్యార్ధుల జనరల్ పాస్ ప్రస్తుతం నెలకు రూ.400 ఉండగా దానిని రూ.600 కి పెంచింది. 

ఇది కాక టోల్ గేట్ గుండా వెళ్ళే బస్సులకు ప్రయాణికుల నుంచే రూ.10 చొప్పున టోల్ ఫీజ్ వసూలు చేయబోతున్నామని టిజిఎస్ ఆర్టీసీ ప్రకటించింది. 

మూడేళ్ళుగా బస్ పాస్ ఛార్జీలు పెంచలేదని, కానీ నిర్వహణ వ్యయం విపరీతంగా పెరిగిపోవడంతో పెంచక తప్పలేదని తెలిపింది. హైదరాబాద్‌, వరంగల్‌ నగరాలలో సిటీ బస్సులలో చాలా రద్దీగా ఉంటున్నందున ఇకపై విద్యార్ధులు ఈ పాసులతో మెట్రో బస్సులలో ప్రయాణించేందుకు అనుమతిస్తున్నామని తెలిపింది.    

కనుక ఈ రెండు నిర్ణయాలను అందరూ స్వాగతించాలని టిజిఎస్ ఆర్టీసీ ప్రజలకు విజ్ఞప్తి చేసింది. ఇది కొర్రు కాల్చి వాత పెట్టి చాలా సంతోషంగా ఉందని చెప్పమని అడిగినట్లుంది. 

మహాలక్ష్మి పధకం వలన ఆర్టీసీపై పెను భారం పడుతోంది. దానిని రాష్ట్ర ప్రభుత్వం సర్దుబాటు చేస్తామని చెప్పినప్పటికీ, ప్రభుత్వ ఆర్ధిక పరిస్థితి కూడా బాగోలేదు. కనుక మహాలక్ష్మి బకాయిల చెల్లింపులు ఆలస్యమవుతున్నాయి. కనుక ఈ సమస్యకు పరిష్కారం విద్యార్ధుల బస్ పాస్ ఛార్జీలు పెంచినట్లు అర్దమవుతూనే ఉంది. 

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించి, దాని కోసం వారి పిల్లల బస్సు పాసుల పేరుతో రూ.200 చొప్పున వెనక్కు తీసుకొంటున్నట్లే కదా?తక్షణం ఈ పెంపు నిర్ణయాన్ని ఉపసమహరించుకోవాలని  సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ డిమాండ్ చేశారు. 

Related Post