కేపీహెచ్‌బీలో గజం కనిష్టంగా లక్షన్నర!

January 24, 2025
img

కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు (కేపీహెచ్‌బీ) పశ్చిమ డివిజన్‌లో ఖాళీగా ఉన్న 24 ప్లాట్లలో 23 ప్లాట్లకు శుక్రవారం వేలంపాట జరిగింది. కనిష్టంగా చదరపు గజం రూ.1.50 లక్షలకు అమ్ముడుపోగా గరిష్టంగా రూ.1.85 లక్షలకు అమ్ముడుపోయింది. ప్లాట్స్ కొనుగోలుకు భారీ సంఖ్యలో ప్రజలు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు పోటీపడటంతో మొత్తం 23 ప్లాట్స్ హాట్ కేకుల్లా వేలంపాటలో అమ్ముడుపోయాయి. మిగిలిన ఒక్క ప్లాట్‌కు కూడా త్వరలోనే వేలంపాట నిర్వహిస్తామని అధికారులు తెలిపారు. 

ఓ పక్క వేలంపాట సాగుతుండగానే కేపీహెచ్‌బీలో నివాసం ఉంటున్నవారు వేసిన పిటిషన్‌ హైకోర్టులో నేడు విచారణ జరిగింది. నిబంధనల ప్రకారం పార్కు, మొక్కలు నాటేందుకు మొత్తం 54.29 ఎకరాల కేపీహెచ్‌బీలో లేఅవుట్‌లో పడి శాతం కేటాయించాల్సి ఉండగా అధికారులు ఆ నిబంధన పట్టించుకోకుండా పార్కు స్థలాన్ని కూడా వేలంవేస్తున్నారని పిటిషన్‌ వేశారు. 

దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ టి. వినోద్ కుమార్‌ ప్రభుత్వం తరపున ఈ కేసు వాదించడానికి వచ్చిన ఏజీ సుదర్శన్ రెడ్డిని పార్క్ కోసం 10 శాతం స్థలం విడిచిపెట్టారా? లేదా చెప్పాలని నిలదీశారు.

ఆయన జవాబిస్తూ గతంలోనే ఆ స్థలాన్ని జీహెచ్ఎంసీకి అప్పగించామని తెలియజేశారు. అయితే ఆ స్థలం కొలతలు, లొకేషన్ మ్యాప్‌తో సహా పూర్తి వివరాలు కోర్టుకి సమర్పించాలని న్యాయమూర్తి ఆదేశించారు. అది పరిశీలించిన తర్వాత తీర్పు చెపుతామని కనుక అంతవరకు ఎవరికీ తుది కేటాయింపులు జరపవద్దని జస్టిస్ టి. వినోద్ కుమార్‌ ఆదేశించారు. 

           


Related Post