ప్రభుత్వాలు మారాయి కానీ మిర్చి రైతుల పరిస్థితి అలాగే ఉంది!

March 01, 2024
img

తెలంగాణలో ప్రభుత్వాలు మారాయి. బిఆర్ఎస్ స్థానంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కానీ రాష్ట్రంలో మిర్చి రైతుల కష్టాలు మాత్రం ఇంకా అలాగే ఉన్నాయి. ఈరోజు ఖమ్మం వ్యవసాయ మార్కెట్ గేటు ముందు బైటాయించి మిర్చి రైతులు నిరసన తెలిపారు. 

జెండా పాట ధర క్వింటాల్‌కు రూ.20,800 ప్రకటించి, అమ్మకాలు మొదలుపెట్టిన తర్వాత మిర్చి నాణ్యంగా లేదని చెపుతూ వ్యాపారులు రూ.14-16,000 మాత్రమే చెల్లిస్తున్నారని మిర్చి రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీస గిట్టుబాటు ధర చెల్లించకపోతే తాము తీవ్రంగా నష్టపోతామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. 

తాము రేయింబవళ్ళు ఎంతో శ్రమించి మిర్చి పండించి మార్కెట్‌కు తీసుకువస్తే, వ్యాపారులందరూ కుమ్మక్కు అయ్యి ధర తగ్గించేసి తమని దోచుకుంటున్నారని మిర్చి రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. జెండా పాట ప్రకారం తమకు ధర చెల్లిస్తే తప్ప ఆందోళన విరమించబోమని చెపుతూ అమ్మకాలు జరుగకుండా అడ్డుకున్నారు. 

ఈ విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ మధుసూధన్ నాయక్ అక్కడకు చేరుకొని రైతులకు నచ్చ జెప్పి శాంతింపజేసే ప్రయత్నం చేశారు. కానీ ‘మాకు కాదు... మమ్మల్ని దోచుకోవాలని చూస్తున్న ఆ వ్యాపారులకి బుద్ధి చెప్పండి, అంటూ కలెక్టర్ మీద మిర్చి రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఆయన ఖమ్మం మార్కెట్ యార్డులో మిర్చి కొనుగోళ్ళు నిలిపివేసి మార్కెట్ అధికారులు, వ్యాపారులతో సమావేశమయ్యి చర్చిస్తున్నారు.

Related Post