ఇంటిలిజెంట్ రివ్యూ & రేటింగ్

February 09, 2018
img

రేటింగ్ : 1.5/5

కథ :

పేదవారిని చేరదీసి చదువు చెప్పించి.. తన సార్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగం ఇప్పించి వారిని కంపెనీ భాగస్వామ్యులుగా వాటాను కూడా ఇచ్చే ఆలోచనతో ఉంటాడు నంద కిశోర్ (నాజర్) చిన్నప్పుడు తన చేతుల మీద గోల్డ్ మెడల్ అందుకున్న తేజా (సాయి ధరం తేజ్)ను తనతోనే ఉంచుకుంటాడు. మంచి పనులు చేసే నందకిశోర్ మీద విలన్ విక్కీ భాయ్ (రాహుల్ దేవ్) కన్ను పడుతుంది. మంత్రి వినీత్ కుమార్ సాయంతో నంద కిశోర్ ను చంపేస్తారు. ఇక నంద కిశోర్ చావుకి తేజాగా ఉన్న హీరో ధర్మా భాయ్ గా మారి ధర్మాన్ని కాపాడాలని చూస్తాడు. ఇంతకీ నందకిశోర్ ను వారు ఎలా చంపారు..? విలన్లను ధర్మా భాయ్ అలియాస్ తేజా ఎలా శిక్షించాడు..? అన్నది సినిమా కథ.

విశ్లేషణ :

ఆల్రెడీ తిక్క, విన్నర్, జవాన్ సినిమాలతో నిరాశ పరచిన తేజ్ ఇంటిలిజెంట్ గా కూడా రొటీన్ కథ, కథనాలతో వచ్చి నిరాశ పరచాడు. ఆకుల శివ అందించిన కాలం చెల్లిన ఈ కథకు కథనం కూడా అదే విధంగా నడిపించారు. కథ, కథనాల్లో ఏమాత్రం కొత్తదనం కనిపించకపోగా ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడుతుందని చెప్పొచ్చు.

సమాజానికి మంచి చేద్దామనుకునే ఓ వ్యక్తి దగ్గర హీరో ఉండటం. అతన్ని విలన్స్ టార్గెట్ చేసి చంపడం.. ఆ తర్వాత విలన్ వారి పని పట్టడం ఇలాంటి కథలు ఏడాదికి పదుల కొద్ది సినిమాల్లో వస్తాయి. పోని కథనం ఏమన్నా ఇంట్రెస్టింగ్ గా నడిపించారా అంటే అది కూడా అదే విధంగా సాగతీశారు. రొటీన్ గా అనిపించే కథ.. ఏదో నడిపించాలనిపించే కథనం.. వచ్చాయా.. వెళ్లాయా అన్నట్టు పాటలు.. ఇలా సినిమా అంతా ఓ డ్రామాగా సాగిందని చెప్పాలి. వినాయక్, తేజ్ ల కాంబోకి తగిన కథ కాదని చెప్పాలి. ఏ వర్గం ఆడియెన్స్ ను అలరించలేదు. 

నటన, సాంకేతిక వర్గం :

సాయి ధరం తేజ్ తన పాత్ర వరకు న్యాయం చేశాడు. అయితే కథలో దమ్ము లేకపోవడంతో తను ఎంత చేసినా లాభం లేకుండా పోయింది. లావణ్య త్రిపాఠి అందానికే పరిమితం అయ్యింది. రాహుల్ దేవ్ విలనిజం అంతగా పడలేదు. వినీత్ కుమార్ కూడా ఏదో అలా చేశాడు. షయాజి శిండే, ఆశిష్ విద్యార్ధి రొటీన్ పోలీస్ పాత్రల్లో కనిపించారు. సప్తగిరి, వేను, రాహుల్ రామకృష్ణ్ ఉన్నా కామెడీ పండలేదు.

ఇక ఇంటిలిజెంట్ టెక్నికల్ టీం విషయానికొస్తే.. విశ్వేశ్వర్ సినిమాటోగ్రఫీ కాస్త బెటర్ అనిపించగా.. తమన్ మ్యూజిక్ ఆకట్టుకోలేదు. ఆకుల శివ కథ పాత చింతకాయ పచ్చడిలా ఉండగా.. కథనం కూడా అదే తీరున సాగింది. డైరక్టర్ వినాయక్ తన కెరియర్ లో ఇలాంటి సినిమా తీసి ఉండరు. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. 

ఒక్కమాటలో :

పేరు లోనే 'ఇంటిలిజెంట్' కథ కథనాల్లో వెరీ పూర్..!


Related Post