అది శుభవార్తే..

November 04, 2017
img

కార్పోరేట్ స్కూళ్ళు, కాలేజీలు వచ్చిన తరువాత రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్ళు, కాలేజీల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. అవి చిన్న స్కూళ్ళు, కాలేజీలను..వాటిలో విద్యార్ధులను..అధ్యాపకులను కూడా కబళించుతుండటంతో వాటి మనుగడ ప్రశ్నార్ధకమైంది. ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్, డిగ్రీ కాలేజీలలో నెలకొన్న అనేక సమస్యల కారణంగా తల్లితండ్రులు తమ శక్తికి మించిన పనే అయినప్పటికీ తమ పిల్లలను కార్పోరేట్ స్కూళ్ళు, కాలేజీలలో చేర్పించడానికే ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. కార్పోరేట్ కాలేజీ యాజమాన్యాలు ప్రత్యక్ష రాజకీయాలలో..అక్కడి నుంచి ప్రభుత్వంలో కూడా ప్రవేశించడంతో మొత్తం విద్యావ్యవస్థ వారి చెప్పుచేతల్లోకి వెళ్ళిపోయింది. 

ఈ పరిస్థితులలో కూడా తెలంగాణా ప్రభుత్వం సర్కార్ చేపడుతున్న అనేక చర్యల కారణంగా రాష్ట్రంలో ప్రభుత్వ జూనియర్ కాలేజీలలో చేరే విద్యార్ధుల సంఖ్య క్రమంగా పెరుగుతోందని రాష్ట్ర విద్యాశాఖా మంత్రి కడియం శ్రీహరి చెప్పారు. రాష్ట్రంలో గల 404 ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మౌలికవసతులు కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం గత మూడేళ్ళలో వరుసగా రూ. 31.14 కోట్లు, 69.41 కోట్లు, 115.67 కోట్లు కేటాయించామని మంత్రి తెలిపారు. తత్ఫలితంగా 2014-15 లో 77,763 మంది విద్యార్థులు చేరారని, ఆ తరువాత సంవత్సరంలలో వరుసగా 82,581 మంది, 90,716 మంది విద్యార్థులు చేరారని మంత్రి చెప్పారు. అంటే మొదటి ఏడాదిలో 4,818 మంది విద్యార్ధులు అదనంగా చేరగా, రెండవ సంవత్సరంలో ఆ సంఖ్యా దాదాపు రెట్టింపయ్యి 8,135 మందికి పెరిగిందని స్పష్టం అవుతోంది. 

ఒకపక్క కార్పోరేట్ కాలేజీలలో విద్యార్ధులు ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకొంటుంటే, మరోపక్క ప్రభుత్వ జూనియర్ కాలేజీలలో విద్యార్ధుల చేరికలు పెరగడం గమనిస్తే, ప్రభుత్వం గట్టిగా కృషి చేస్తే ప్రభుత్వ కళాశాలలు కూడా కార్పోరేట్ కాలేజీలకు గట్టి పోటీ ఈయవచ్చని స్పష్టం అవుతోంది. 


Related Post