తెలంగాణా మహనీయుల పేర్లు కనుమరుగయ్యాయి: కేసీఆర్

August 22, 2017
img

తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం రంగారెడ్డి జిల్లా బుద్వేల్ లో రాజా బహదూర్ వెంకట్రామి రెడ్డి హాస్టల్ భవనాలకు శంఖుస్థాపన చేశారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ, “సమైక్య రాష్ట్రంలో తెలంగాణా మహనీయుల పేర్లు కూడా కనుమరుగు అయిపోయాయి. వారిలో రాజా బహదూర్ వెంకట్రామి రెడ్డి కూడా ఒకరు. ఆయన అప్పట్లో కోత్వాల్ అంటే ఇప్పటి డిజిపితో సమానమైన హోదాలో పనిచేసేవారు. ఆయన పోలీస్ అధికారి అయినప్పటికీ సమాజంలో అన్ని వర్గాల ప్రజలకు మేలు కలిగించే అనేక సేవా కార్యక్రమాలు చేసేవారు. ఆ రోజుల్లోనే విద్య యొక్క అవసరం, గొప్పదనం ఆయన గుర్తించి రెడ్డి హాస్టల్ నిర్మించారు. అలాగే పేదలు, దళితుల కోసం చాలా కార్యక్రమాలు చేసేరు. అటువంటి మహనీయుడి పేరిట నిర్మింపబడుతున్న ఈ హాస్టల్ కు శంఖుస్థాపన చేయడం నా అదృష్టం. హాస్టల్ కు కేటాయించిన 10 ఎకరాలు కాక మరో 5 ఎకరాలను కూడా కేటాయిస్తాము. నారాయణగూడాలో ఉన్న బాలికల హాస్టల్ విస్తరణ కోసం పక్కనే ఉన్న ఖాళీ స్థలాన్ని కేటాయించాలని నిర్ణయించాము,” అని కేసీఆర్ అన్నారు. 

Related Post