కార్పోరేట్ కళాశాలల కంటే గురుకులాలే మేలు!

July 04, 2017
img

ప్రభుత్వ పాఠశాలలంటే సమస్యలకు నిలయాలని నేటికీ చాలా మంది భావిస్తుంటారు. అది నిజం కూడా. అందుకే సామాన్య ప్రజలు తమ స్తోమతకు మించినప్పటికీ వేరే మార్గం లేకపోవడంతో తమ పిల్లలను ప్రైవేట్ పాఠశాలలలో వేస్తుంటారు. కానీ వారు తమ అభిప్రాయం మార్చుకొని, తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపే రోజు దగ్గరలోనే ఉందనిపిస్తుంది రాష్ట్రంలోని ప్రభుత్వ గురుకుల పాఠశాలల విద్యార్ధులు సాధించిన విజయాలు చూస్తే. 

ఒకటీ రెండూ కాదు..ఈ ఏడాది ఏకంగా 84 మంది గురుకుల విద్యార్ధులు నీట్ పరీక్షలలో ఉతీర్ణులవడం గొప్ప విశేషమే. వారందరూ త్వరలోనే వివిధ వైద్యకళాశాలలో వైద్యవిద్యనభ్యసించబోతున్నారు. వారిలో 55మంది ఎస్.సి., 9మంది ఎస్టీ విద్యార్ధులు ఎం.బి.బి.ఎస్.కోర్సులో చేరబోతున్నారు. మరో 15 మంది ఎస్.సి., 5 మంది ఎస్టీ విద్యార్ధులు డెంటల్ కోర్సులలో సీట్లు సాధించారు. 

నీట్ పరీక్షలకు హాజరయ్యేందుకు లక్షలు ఖర్చు పెట్టి శిక్షణ పొందుతున్న విద్యార్ధులు కొన్ని వేలమంది ఉంటారు. ఇక నీట్ శిక్షణ పేరిట కార్పోరేట్ కాలేజీల దోపిడీ అయితే చెప్పనవసరం లేదు. లక్షలు ఖర్చు పెట్టినా మెడికల్ సీట్లు సాధించలేనివారు కోకోల్లలున్నారు. వారు పొరుగునే ఉన్న కర్నాటక రాష్ట్రానికో ఇంకా డబ్బు ఉంటే ఏ చైనా, రష్యా, ఫిలిపిన్స్ దేశాలకో వెళ్ళి వైద్యవిద్యనభ్యసించి వస్తుంటారు. 

కానీ ప్రభుత్వ గురుకుల పాఠశాలల్లో చదువుకొంటున్నవారందరూ ఆర్ధికంగా స్తోమతలేని వారు..నిరుపేద కుటుంబాలకు చెందినవారే అయ్యుంటారు. కానీ వారి ఆర్ధిక పరిమితులు వారి విద్యాభిలాషకు అడ్డంకిగా మారకూడదనే ఉద్దేశ్యంతో తెలంగాణా ప్రభుత్వం 2015లోనే ‘ఆపరేషన్ బ్లూ క్రిస్టల్’ పేరుతో గురుకుల పాఠశాలలలో ఒక శిక్షణా కార్యక్రమం మొదలుపెట్టింది. ప్రతిభగల విద్యార్ధులను గుర్తించి వారికి నీట్ పరీక్షల కోసం శిక్షణ ఇప్పిస్తోంది ప్రభుత్వం. 

దాని ద్వారా ఇంతవరకు 140 మంది పేద విద్యార్ధులు నీట్ పరీక్షలలో ఉత్తీర్ణులయ్యారు. ఈ ఏడాది అత్యధికంగా 84మంది ఉత్తీర్ణులవడం విశేషం. అంటే ప్రైవేట్ కోచింగ్ సెంటర్ల కంటే, కార్పోరేట్ కాలేజీల కంటే ప్రభుత్వఅధ్వర్యంలో నడుస్తున్న ఈ గురుకుల పాఠశాలలే మంచి ఫలితాలు కనబరుస్తున్నాయని స్పష్టం అవుతోంది. అయినప్పటికీ అవి ఎటువంటి ప్రచారమూ చేసుకోవు కానీ అరకొర ఫలితాలు సాధించిన కార్పోరేట్ కాలేజీలు మాత్రం చాలా అతిగా ప్రచారం చేసుకోవడం అందరూ చూస్తూనే ఉన్నారు. గురుకుల పాఠశాల విద్యార్ధులు సాధించిన ఈ ఫలితాలను చూసి అప్పుడే విద్యార్ధుల తల్లితండ్రులు వాటిలో తమ పిల్లలను చేర్పించేందుకు పరుగులు తీస్తున్నారు. 

ప్రభుత్వ పాఠశాలలు కూడా గురుకుల పాఠశాలల స్పూర్తితో ఇదేవిధంగా తమ విద్యార్ధులకు చక్కటి శిక్షణ అందించగలిగితే, ఏదో ఒకరోజు ప్రజలందరూ తమ పిల్లలను అక్కడికే పంపించడం ఖాయం. అయితే ముందుగా విద్యాశాఖ ప్రభుత్వ పాఠశాలలపై కూడా దృష్టిసారించి వాటికి అవసరమైన కనీస సౌకర్యాలు కల్పించి, విద్యా ప్రమాణాలు పెరిగేందుకు గట్టిగా కృషి చేయవలసి ఉంటుంది. అప్పుడే అవి కూడా గురుకుల పాఠశాలలతూ పోటీ పడగలవు. అప్పుడు ఈ కార్పోరేట్ కళాశాలలు అవసరం ఉండదు.. విద్యార్ధుల తల్లి తండ్రులు వాటి దోపిడీకి గురికానవసరం ఉండదు. 

Related Post